ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 03:35:57

వైదొలిగిన వివో!

వైదొలిగిన వివో!

  • ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి నిష్క్రమణ!
  • భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులే కారణం.. 
  • కొత్త ఒప్పంద ప్రయత్నాల్లో బీసీసీఐ

ఐపీఎల్‌లో ఈసారి కొత్త స్పాన్సర్‌ను చూడబోతున్నామా? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తున్నది. యూఏఈ వేదికగా త్వరలో మొదలయ్యే ఐపీఎల్‌ 13వ సీజన్‌ నుంచి టైటిల్‌ ప్రధాన స్పాన్సర్‌ వివో కంపెనీ వైదొలిగింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో చైనా కంపెనీలపై భారత్‌లో రోజురోజుకూ వ్యతిరేకత ఎక్కువవుతున్న నేపథ్యంలో వివో.. ఐపీఎల్‌ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది. చైనా కంపెనీలను                                      బీసీసీఐ కొనసాగించేందుకు సిద్ధమవడంతో వెల్లువెత్తిన నిరసనల క్రమంలో వివో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న బీసీసీఐ మూడు రోజుల వ్యవధిలో మరో కంపెనీతో ఒప్పందానికి ప్రయత్నాలు చేస్తున్నది. అన్నీ                  కుదిరితే ఐపీఎల్‌-13వ సీజన్‌లో కొత్త స్పాన్సర్‌ మన ముందుకు రావచ్చు! 

న్యూఢిల్లీ: దేశంలో చైనా కంపెనీలకు సరిహద్దు సెగ తగులుతూనే ఉన్నది. గల్వాన్‌ సరిహద్దు ఘటన నేపథ్యంలో రోజురోజుకు చైనా వస్తువులు, కంపెనీలపై వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. దీనికి ఐపీఎల్‌ కూడా అతీతం కాలేకపోయింది. చైనా కంపెనీలతో ఒప్పందాలను సమీక్షిస్తామన్న మాటను విస్మరించిన బీసీసీఐ వైఖరిపై సోషల్‌ మీడియాలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. దీనికి తోడు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌.. ఐపీఎల్‌ బహిష్కరణకు పిలుపునివ్వడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ నేపథ్యంలో భారత్‌లో నానాటికీ వ్యక్తమవుతున్న నిరసనలను దృష్టిలో పెట్టుకున్న వివో ఐపీఎల్‌ నుంచి వైదొలిగేందుకు సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది పాటు ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌కు దూరంగా ఉండేందుకు వివో సామరస్య పూర్వక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. 2017లో కుదిరిన ఒప్పందం కింద ప్రతి సీజన్‌కు బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తున్న వివో స్పాన్సర్‌షిప్‌ గడువు 2022లో ముగియనుంది. అయితే స్పాన్సర్‌షిప్‌కు ఈ ఏడాది దూరమవుతున్నందున వచ్చే మూడేండ్లు వివోతో బీసీసీఐ ఒప్పందాన్ని సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వివో ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఎక్కడ మొదలైంది 

ఓవైపు సరిహద్దుల్లో చైనా వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం పలు యాప్‌లపై నిషేధం, కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేసుకుంటుంటే బీసీసీఐ అందుకు భిన్నంగా వ్యవహరించింది. లఢక్‌ ఘటన తర్వాత చైనా కంపెనీలతో వాణిజ్య, ఆర్థిక ఒప్పందాలపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దేశ వ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కంపెనీ అయిన వివోకు బోర్డు మద్దతుగా నిలువడం సమస్యకు కారణమైంది. 20 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనా కంపెనీలను త్యజించాల్సింది పోయి వత్తాసు పలుకడంపై ఆర్‌ఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ తమ నిరసన వ్యక్తం చేసింది. దేశ ప్రజలు ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తమ దేశ కంపెనీలపై రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తిని అంచనా వేసిన వివో స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది. అయితే వివో కంపెనీ ప్రతినిధులతో బీసీసీఐ తరఫున అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా సంప్రదింపులు జరుపుతున్నట్లు బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య సామరస్య పూర్వక ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ‘స్పాన్సర్‌లు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అర్ధాంతరంగా వైదొలిగిన సమయాల్లో బీసీసీఐ బ్యాంక్‌ గ్యారంటీని దక్కించుకునేది. ఇది గతంలో పలుమార్లు జరిగింది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. రెండు వర్గాలు కూడా రాజీ కుదుర్చుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఏదైనా దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా చైనా కంపెనీలతో వ్యవహరిస్తే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు’అని ఒక అధికారి అన్నారు.


మరో మూడు రోజుల్లో..

ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో వైదొలుగడంతో బీసీసీఐ తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మూడు రోజుల వ్యవధిలో కొత్త కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలంగా లేని నేపథ్యంలో బోర్డుకు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఇప్పటికిప్పుడు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు కంపెనీలు ముందుకొస్తాయా లేదా అన్నది సందేహంగా మారింది. ఒకవేళ 50 శాతం విలువ (మొత్తం రూ.440 కోట్లు)ను భర్తీ చేసేందుకు ప్రయత్నించినా బోర్డు ఈ విషయంలో సఫలమైనట్లే అని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు లీగ్‌కు ఆదరణతో అంతా సాఫీగా సాగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏడాది స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం కంపెనీలు ఆసక్తి కనబరుస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా వైరస్‌ విజృంభణతో లీగ్‌ యూఏఈలో జరుగుతుండటం, దీనికి తోడు ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగితే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏదైనా అసలు ఏం జరుగుతుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.


logo