శనివారం 11 జూలై 2020
Sports - May 18, 2020 , 18:19:49

భార్య చేతిలో హెయిర్‌క‌ట్‌.. మ‌రింత ధైర్యం కావాలి: పుజారా

భార్య చేతిలో హెయిర్‌క‌ట్‌.. మ‌రింత ధైర్యం కావాలి:  పుజారా

న్యూఢిల్లీ: సెంచ‌రీకి ప‌రుగు దూరంలో సింగిల్‌కు పిలిచేట‌ప్పుడు భాగ‌స్వామిపై న‌మ్మ‌కంతో ముందుకు వెళ్ల‌డం కంటే.. హెయిర్ క‌ట్ కోసం భార్య‌పై న‌మ్మ‌కం ఉంచాలంటే మ‌రింత ధైర్యం కావాల‌ని భార‌త టెస్టు ఆట‌గాడు చ‌తేశ్వ‌ర్ పుజారా పేర్కొన్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా జ‌ట్టు పెరిగి ఇబ్బందులు ఎదుర్కుంటున్న పుజారా.. త‌న భార్య పూజతో హెయిర్ క‌ట్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్ప‌టికే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. త‌న భార్య అనుష్క శ‌ర్మతో క‌టింగ్ చేయించుకున్న విష‌యం తెలిసిందే.

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా క్రీడాటోర్నీల‌న్నీ నిలిచిపోవ‌డంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన ఆట‌గాళ్లు సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉంటున్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లను కాస్త స‌డ‌లించ‌డంతో సోమ‌వారం నుంచి సెలూన్‌ల‌ను తెరిచే అవ‌కాశం ఉన్నా.. స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని భావించిన పుజారా ఇంట్లోనే క్ష‌వ‌రం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. దీనికి అత‌డి భార్య పూజ కూడా సై అన‌డంతో ఆ కార్యం కాస్త నిర్వ‌ఘ్నంగా పూర్తిచేశాడు. ఈ క్ర‌మంలో త‌న కొత్త హెయిర్ క‌ట్ ఫొటో పోస్ట్ చేసిన పుజారా `99 ప‌రుగుల‌పై బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు భాగ‌స్వామిపై విశ్వాసం ఉంచి సింగిల్ కోసం ముందుకెళ్ల‌డం కంటే.. హెయిర్ క‌ట్ కోసం భార్య‌పై న‌మ్మ‌కం ఉంచాలంటే మ‌రింత ధైర్యం కావాల్సిందే` అని వ్యాఖ్య జోడించాడు. 


logo