కంకోల్ గ్రామం కొత్త సొబగులు అద్దుకున్నది. పల్లె ప్రగతితో అభివృద్ధి బాట పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోక సమస్యల వలయంలో చిక్కుకుపోయిన కొంకోల్ గ్రామంలో శరవేగంగా మార్పు సంతరించుకున్నది. శిథిలావస్థలో ఉన్న భవనాలు, బురదమయంగా మారిన రోడ్లు, దుర్గంధమైన పరిసరాలతో అస్తవ్యస్తంగా ఉండే ఈ గ్రామం ప్రస్తుతం పారిశుధ్యం, పచ్చని మొక్కలతో అందంగా ముస్తాబైంది. ఇదంతా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో గ్రామాభివృద్ధి సాధ్యమైంది.
పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధి బాట పడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కంకోల్ గ్రామం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ సహకారంతో సర్పంచ్ విశ్వనాథంపాటిల్ ఆధ్వర్యంలో నూనతంగా ఏర్పాటు చేసిన రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం నిర్మాణాలు పూర్తి చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న 50 పాత ఇండ్లను, 120 పెంటకుప్పలను తొలిగించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు, సీసీరోడ్లు, మురుగు కాల్వలను నిర్మించారు. గ్రామంలో అడుగు పెట్టగానే హరితహారంలో నాటిన మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. ఎటు చూసినా పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులతో కంకోల్ గ్రామం అందంగా కనిపిస్తున్నది. గ్రామంలో 480 పైచిలుకు కుటుంబాలు ఉండగా… 2,868 మంది జనాభా ఉన్నది. కంకోల్ గ్రామం మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధిలో పరుగులుపెడుతున్నది. ఇప్పటివరకు గ్రామంలో దాదాపు రూ.60లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో గ్రామ రూపురేఖలే మారి పోయాయి.
అభివృద్ధ్యే లక్ష్యంగా..
పల్లెప్రగతి నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. గత పాలకుల నిర్లక్ష్యానికి గ్రామం అబివృద్ధికి అమడ దూరంలో నిలిచింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామ రూపు రేఖలే మారిపోయాయి. గ్రామంలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. పంచాయతీ పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. మా గ్రామం పల్లెప్రగతి కార్యక్రమంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
అందరి కృషితో….
ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సమష్టి కృషితో అభివృద్ధిలో దూసుకుపోతుంది. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లిస్తూ గ్రామ అభివృద్ధ్దిలో పాలుపంచుకుంటున్నారు. గ్రామ అభివృద్ధిలో అందరి సహకారం చాలా బాగుంది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.