శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 16:47:33

కివీస్‌కు షాక్‌..భారత్‌తో వన్డేలకు కేన్‌ ఔట్‌

కివీస్‌కు షాక్‌..భారత్‌తో వన్డేలకు కేన్‌ ఔట్‌

భుజం గాయం కారణంగా తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులో ఉండడని కివీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

హామిల్టన్‌:  భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను కోల్పోయి ఒత్తిడిలో ఉన్న న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భారత్‌తో వన్డేలకు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడని కివీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.  కేన్‌ వైదొలగడంతో  వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ టామ్‌ లాథమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.  అన్ని రంగాల్లో జోరు మీదున్న కోహ్లీసేనకు వన్డేల్లో ఆతిథ్య కివీస్‌ జట్టు ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి. చాలా రోజులుగా కేన్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ జట్టుకు అండగా నిలుస్తూ వస్తున్నాడు. 

కేన్‌ స్థానంలో జట్టులోకి యువ క్రికెటర్‌ మార్క్‌ చాప్‌మన్‌ను ఎంపిక చేశారు. భారత్‌-ఏతో అనధికార మూడో వన్డే  మ్యాచ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న చాప్‌మన్‌ శతకంతో సత్తాచాటాడు.  టీమ్‌ఇండియాతో మూడో టీ20లో విలియమ్సన్‌ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆఖరి రెండు టీ20లకు  విశ్రాంతి తీసుకున్నాడు.  గాయం తీవ్రత పెద్దదేమీ కాదని ఎక్స్‌-రేలో తేలినప్పటికీ స్వదేశంలో భారత్‌తో వన్డేల అనంతరం కీలకమైన టెస్టు సిరీస్‌ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేన్‌కు అవసరమైన విశ్రాంతినివ్వాలని కివీస్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మౌంట్‌మాంగనూయ్‌ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫైనల్‌ వన్డేకు అతడు జట్టుతో కలుస్తాడని కివీస్‌ అంచనా వేస్తోంది. 


logo