శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 29, 2020 , 13:39:43

యూఏఈలో ఐపీఎల్‌.. ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తారా ?

యూఏఈలో ఐపీఎల్‌.. ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తారా ?

హైద‌రాబాద్‌: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ ఎడిష‌న్‌.. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో జ‌ర‌గ‌డం దాదాపు ఫిక్స్ అయ్యింది. మ‌రి క‌రోనా వైర‌స్ ఆంక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో.. ఆ టోర్నీకి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తారా లేదంటే ప్రేక్ష‌కులు లేకుండానే మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారా అన్న‌ది సంశ‌యంగా మారింది. క‌నీసం స్వ‌ల్ప స్థాయిలోనైనా ప్రేక్ష‌కుల‌ను స్టేడియాల్లోకి ఎంట్రీ క‌ల్పిస్తారా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై ఐపీఎల్ గ‌వ‌ర్న‌ర్ కౌన్సిల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. యూఏఈ ప్రభుత్వ విధానం మీద ఆ విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని బ్రిజేశ్ తెలిపారు. త‌క్కువ సంఖ్య‌లో ప్రేక్ష‌కుల‌ను స్టేడియాల్లోకి అనుమ‌తివ్వాలా లేక క్లోజ్డ్ డోర్‌లోనే మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించాల్సిన అంశం యూఏఈ ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న‌ట్లు బ్రిజేశ్ ఓ మీడియాతో వెల్ల‌డించారు. 

ఆగ‌స్టు 2వ తేదీన జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశంలో యూఏఈ టోర్నీకి సంబంధించిన మ‌రికొన్ని విష‌యాలు తెలియ‌నున్నాయి.  మ్యాచ్ తేదీలు, ఎన్ని మ్యాచ్‌లు నిర్వ‌హించాలి, వేదిక‌లు, ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఎప్పుడు ఉంటాయి, శిక్ష‌ణ స‌దుపాయాలు, బ్రాడ్‌కాస్టింగ్ ఎవ‌రు చేస్తారు అనే అంశాల‌ను ఆ రోజున తేల్చే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అమ‌లు చేస్తున్న ఆంక్ష‌ల విష‌యాన్ని కూడా 8 ఫ్రాంచైజీలు ఎలా పాఠించాల‌న్న అంశాన్ని కూడా తేల్చ‌నున్నారు. క్వారెంటైన్ ప‌ద్ధ‌తి గురించి ఆ భేటీలో తెలిసే అవ‌కాశాలు ఉన్నాయి.  బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జ‌య్ షా, కోశాధికారి అరుణ్ దుమాల్‌లు ఆ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. 

51 రోజుల షెడ్యూల్‌లో క‌నీసం 60 ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. స్టార్‌స్పోర్ట్స్‌తో మ్యాచ్‌ల టైమింగ్ గురించి చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం, జాయెద్ క్రికెట్ స్టేడియం, షార్జా క్రికెట్ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.  ఐపీఎల్ టోర్నీలో పాల్గొనేందుకు భార‌త్ నుంచి సుమారు 1200 మంది యూఏఈకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు అక్క‌డ అధికారులు చెబుతున్నారు.  భార‌త క్రికెట‌ర్లు, అధికారులు, స‌పోర్ట్ స్టాఫ్‌, బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌, విదేశీ ఆట‌గాళ్లతో మొత్తం క‌లిపి సుమారు 1200 మంది యూఏఈ వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.  క్రికెట‌ర్ల ఫ్యామిలీల‌ను తీసుకువెళ్లాలా వ‌ద్దా అన్న అంశాన్ని కూడా ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ భేటీలో తేల్చ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ 8 వ‌ర‌కు ఐపీఎల్ నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే.
logo