ఆదివారం 05 జూలై 2020
Sports - May 17, 2020 , 16:51:58

'ప్రేక్షకులు లేకుండా ఆడటాన్ని అలవాటు చేసుకోవాలి'

'ప్రేక్షకులు లేకుండా ఆడటాన్ని అలవాటు చేసుకోవాలి'

వెల్లింగ్టన్: మ్యాచ్‌లు జరుగకుంటే చాలా క్రికెట్ బోర్డులు నష్టపోతాయని, అందుకే ప్రేక్షకులు లేకుండా పోటీలు నిర్వహించినా మంచిదేనని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మి నీషమ్ అభిప్రాయపడ్డాడు. ప్రేక్షకులు లేకుండా ఆడటాన్ని ఆటగాళ్లు అలవాటు చేసుకోవాల్సిందేనని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ ఖాళీ స్టేడియాల్లో నిర్వహించినా పర్వాలేదని అన్నాడు. 

'స్టేడియంలో ప్రేక్షకులు ఉంటేనే బాగుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సిన పరిస్థితిని అలవాటు చేసుకోవాలి. టీ20 ప్రపంచకప్ కేవలం ఖాళీ స్టేడియాల్లో మాత్రమే నిర్వహించగలిగే  పరిస్థితి వస్తే.. అందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలి. మ్యాచ్‌లు నిలిచిపోయినందు వల్ల అనేక క్రికెట్ బోర్డులు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అందుకే ప్రేక్షకులు లేకుండా అయినా మ్యాచ్ లు ఆడాల్సిందే. ఈ విషయంలో ఆటగాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవని నేను అనుకుంటున్నా' అని నీషమ్ చెప్పాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం క్రికెట్ పోటీలన్నీ నిలిచిపోగా, ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీపైనా సందిగ్ధత ఏర్పడింది. 


logo