శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 16, 2020 , 08:04:22

మూగబోయిన మైదానాలు

మూగబోయిన మైదానాలు
  • కరోనాతో టోర్నీలు రద్దు ..స్టేడియాలు వెలవెల

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో.. ప్రేక్షకులతో కళకళలాడాల్సిన మైదానాలు ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం లక్నో వేదికగా ఆదివారం జరుగాల్సిన భారత్‌, దక్షిణాఫ్రికా రెండో వన్డే రద్దు కాగా.. విశ్వవ్యాప్తంగా సిరీస్‌లన్నీ ప్రభావితమయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా.. జనాలు గుమిగూడటం మంచిది కాదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో‘వేసవి క్రికెట్‌ పండుగ’ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండు వారాలు ముందుకు జరిగింది. ఫుట్‌బాల్‌ టోర్నీలన్నింటికీ ‘ఫిఫా’ నెలన్నరపాటు ఫుల్‌స్టాప్‌ పెడితే.. ఆల్‌ఇంగ్లండ్‌ ఓపెన్‌ మినహా మిగిలిన టోర్నీలకు బ్యాడ్మింటన్‌ సమాఖ్య మంగళం పాడింది. మొత్తానికి కొవిడ్‌-19 క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. వైరస్‌ దెబ్బకు క్రీడతో సంబంధం లేకుండా స్టేడియాలన్నీ మూగబోతున్నాయి.


భారత క్రికెట్‌ రూపురేఖలు మార్చిన ‘క్యాష్‌ రిచ్‌ లీగ్‌' ఐపీఎల్‌ వాయిదా పడటంతో క్రీడాభిమానులు ఉసూరుమంటున్నారు. ఈ పాటి కే దేశవ్యాప్తంగా ఐపీఎల్‌ హంగామా మొదలవ్వాల్సిన చోట.. అసలు లీగ్‌ జరుగుతుందా లేదా అనే చర్చ సాగుతున్నది. బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలోనూ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో.. 13వ సీజన్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ సజావుగా సాగినా.. మ్యాచ్‌లను కుదించక తప్పకపోవచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సూచనప్రాయంగా చెప్పిన నేపథ్యంలో లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అభిమాన ఆటగాళ్ల విన్యాసాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకున్నా.. ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే టీవీల్లో చూసి సంతోషిద్దామనుకున్నా.. కేంద్రప్రభుత్వం ఏప్రిల్‌ 15 వరకు బీ2 (వాణిజ్య) వీసాలు రద్దు చేయడంతో అంతర్జాతీయ ఆటగాళ్లు లీగ్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ధోనీ పదిహేను రోజుల ప్రాక్టీస్‌ తర్వాత చెన్నై వీడి.. రాంచీకి పయనమయ్యడు.


logo