శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 22, 2020 , 00:51:45

వివాదమెందుకు?

వివాదమెందుకు?

  • నా గాయం చిన్నదే, కోలుకుంటున్నా..  
  • బీసీసీఐని సంప్రదిస్తూనే ఉన్నా 
  • ఆస్ట్రేలియాతో టెస్టులకు సిద్ధమవుతా.. 
  • టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 

న్యూఢిల్లీ: తన గాయం వల్ల రేగిన వివాదంపై టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఐపీఎల్‌లో కండరాల గాయమవడం, ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు తనను పక్కనపెట్టడం, వెంటనే ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడడం, టెస్టు జట్టుకు ఎంపిక తదితర అంశాలపై పెదవి విప్పాడు. గాయం కారణంగా ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్‌.. మళ్లీ ప్లేఆఫ్స్‌కు ఓ మ్యాచ్‌ ముందు నుంచి ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు. ఫైనల్‌లో అర్ధశతకంతో అదరగొట్టి ముంబైకి రికార్డుస్థాయిలో ఐదో టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలో ఆసీస్‌ టూర్‌ టెస్టు జట్టులో రోహిత్‌ పేరును సెలెక్టర్లు చేర్చారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ    (ఎన్‌సీఏ)లో హిట్‌మ్యాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ పొందుతూ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. ఈ విషయాలపై శనివారం ఓ ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ మాట్లాడాడు. తన గాయం చిన్నదేనని ముందు నుంచి తెలుసునని, ఎప్పటికప్పుడు బీసీసీఐకి సమాచారం అందిస్తూనే ఉన్నానంటూ చెప్పిన విషయాలు రోహిత్‌  మాటల్లోనే.. 

నేనే ఆడాలనుకున్నా

నాకు ఏం జరుగుతుందో(వివాదం తలెత్తడంపై) తెలియలేదు. అసలు అందరూ దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను నిరంతరం బీసీసీఐ, ముంబై ఇండియన్స్‌ను సంప్రదిస్తూనే ఉన్నా. ఫిట్‌నెస్‌ సమాచారం చెబుతూనే ఉన్నా. పొట్టి ఫార్మాట్‌లో నేను ఆడగలనని ముంబై యాజమాన్యానికి చెప్పాక బరిలోకి దిగా. ఇబ్బందిగా ఉంటే నేనే ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో ఆడకపోయి ఉండేవాడిని కదా.  నేను ఏం చేయాలని నిర్ణయించుకుంటానో.. దానిపైనే పూర్తి ఏకాగ్రత పెడతా. 

అందుకే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు వెళ్లలేదు 

నా గాయం పూర్తిగా తగ్గేందుకు ఇంకొంత కసరత్తులు చేయాల్సి ఉంది. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు వెళ్లాలనుకోలేదు. 11 రోజుల్లో ఆరు మ్యాచ్‌లు ఆడడం ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్‌ కాదనుకున్నా. 25 రోజుల్లో నేను పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాననిపించింది. ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడతా. ఇది నాకు చాలా సులువైన నిర్ణయమనిపించింది. మరి ఇతరులు ఎందుకు క్లిష్టతరం చేస్తున్నారో నాకు తెలియదు. 

వివాదమిదే.. 

తీవ్ర గాయమయ్యే అవకాశముందని వైద్య నివేదిక రావడంతో సెలెక్టర్లు తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ శర్మను ఎంపిక చేయలేదు. దీంతో వెంటనే మళ్లీ ఆడొద్దని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి హిట్‌మ్యాన్‌కు సూచించారు. అయితే రోహిత్‌ మాత్రం ప్లేఆఫ్స్‌కు ముందు ఓ మ్యాచ్‌ నుంచి ఐపీఎల్‌లో ఆడాడు. దీంతో హిట్‌మ్యాన్‌కు అసలు ఏమైందన్న వివాదం చెలరేగింది. అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో సెలెక్టర్లు రోహిత్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పక్కన పెట్టి టెస్టు జట్టులో చోటిచ్చారు. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తర్వాత కోహ్లీ స్వదేశానికి రావాలని నిర్ణయించుకోవడంతో రోహిత్‌ కీలకం కానున్నాడు. 

రాత్రికి రాత్రే జరిగింది కాదు

వేరే జట్టుతో రోహిత్‌ ఇలా చేయగలడా?(ఐపీఎల్‌ టైటిళ్లు గెలువడం) అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ అవసరం ఏముంది? నన్ను, ప్లేయర్లను ఫ్రాంచైజీ తీసుకుంది. నేను వీరితోనే ముందుకు సాగుతా. ఈ జట్టు రూపకల్పన ఏమైనా రాత్రికి రాత్రి జరిగిందా? మా ఫ్రాంచైజీ మాటిమాటికి ఆటగాళ్లను మార్చలేదు. నన్ను ఎంపిక చేసుకొని పటిష్టమైన జట్టును నిర్మించడంపై ఎప్పటి నుంచో దృష్టిసారించింది.  

ఒత్తిడేం లేదు: షమీ 


సిడ్నీ: ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కనబర్చిన ప్రదర్శన తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ పేర్కొన్నాడు. తాజా సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు తరఫున 20 వికెట్లు పడగొట్టిన షమీ.. ముంబై ఇండియన్స్‌తో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌ వంటి బ్యాట్స్‌మెన్‌ను ఐదు పరుగులు చేయనివ్వకుండా అడ్డుకొని అదుర్స్‌ అనిపించిన విషయం తెలిసిందే. శనివారం షమీ మాట్లాడుతూ.. ‘నా ప్రయాణం సరైన దిశలో సాగుతున్నదని ఐపీఎల్‌ నిరూపించింది. ఈ ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీంతో వచ్చే సిరీస్‌ల కోసం ఎలాంటి ఒత్తిడి లేకుండా సిద్ధమవుతున్నా. లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌తో పాటు బౌలింగ్‌ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టా. దాని ఫలితం ఐపీఎల్‌లో కనిపించింది. ప్రస్తుతం సుదీర్ఘ పర్యటన కోసం సిద్ధమవుతున్నా. నెట్స్‌లో అత్యుత్తమ ఆటగాళ్లకు బంతులు వేయడం ద్వారా ఇంకా మెరుగవ్వొచ్చు. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. నిలకడగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల బౌలర్లు మన వద్ద ఉన్నారు’అని అన్నాడు.