పింక్ పోరులో ఆధిపత్యం ఎవరిదో !

బరిలో దిగిన ఏడు గులాబీ టెస్టుల్లో అజేయంగా నిలిచిన జట్టు ఓ వైపు.. ఆది నుంచి డే అండ్ నైట్ మ్యాచ్‌లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని జట్టు మరోవైపు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్ మొదలు పెడితే విజయం తమదే అన్న ధీమా ఓ వైపు.. సాయంసంధ్యా సమయంలో గులాబీ బంతిని ఎదుర్కోవడం కష్టమే అని భావిస్తున్న జట్టు మరోవైపు. మొత్తంగా ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్లు అడిలైడ్ వేదికగా గురువారం నుంచి గులాబీ బంతితో తలపడేందుకు సమర సన్నద్ధతతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పోరుకు ముందు ఇరు జట్ల గెలుపు అవకాశాలను ఓసారిపరిశీలిస్తే..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
ఐదేండ్ల క్రితమే డే అండ్ నైట్ టెస్టుకు శ్రీకారం చుట్టిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు గులాబీ బంతితో ఏడు మ్యాచ్‌లు ఆడింది. రెండు సార్లు న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆసీస్.. పాకిస్థాన్‌ను రెండు సార్లు ఓడించింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంకపై ఒక్కో విజయం సాధించింది. ఇక భారత్ విషయానికి వస్తే.. బంతి నాణ్యత, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్ గమనంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన టీమ్ఇండియా.. సౌరవ్ గంగూలీ బీసీసీఐ పీఠం అధిరోహించాక తొలిసారి గులాబీ టెస్టు ఆడింది. ప్రత్యర్థి బంగ్లాదేశ్ కావడంతో సులువుగా గట్టెక్కిన కోహ్లీసేనకు.. ఆసీస్‌లో అసలు సవాలు ఎదురుకానుంది. గత పర్యటన (2018-19)లోనే ఓ మ్యాచ్‌ను డే అండ్ నైట్‌గా నిర్వహిద్దాం అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించినా.. అనుభవలేమి కారణంగా భారత్ ససేమిరా అన్న విషయం తెలిసిందే.
మొగ్గు మనవైపే..
పింక్ టెస్టుల్లో ప్రత్యర్థి రికార్డు ఘనంగా ఉన్నా.. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే మొగ్గు మనవైపే కనిపిస్తున్నది. మయాంక్, గిల్, కోహ్లీ, రహానే, పుజారా, విహారితో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా పేస్ రాటుదేలడం భారత్‌కు సానుకూలాంశం. విదేశీ గడ్డపై విజయాలు సాధించాలంటే పేసర్లు రాణించడం తప్పనిసరి. 20 వికెట్లు పడగొట్టే సత్తా మా బౌలర్లకు ఉందని వైస్ కెప్టెన్ రహానే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. బుమ్రా, షమీ, ఉమేశ్, అశ్విన్ స్థాయికి తగ్గట్లు రాణిస్తే కంగారూలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. గత పర్యటనలో ఆసీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన పుజారా అదే ఫామ్ కొనసాగిస్తే భారీ స్కోర్లు ఖాయమే. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడని కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి వచ్చేయడానికి ముందే అదిరే ఇన్నింగ్స్‌తో సిరీస్‌లో జట్టుకు ఆధిక్యం అందించాలని భావిస్తున్నాడు.
గాయాల బెడద..
2018-19తో పోల్చుకుంటే ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉందనేది వాస్తవమే అయినా.. కంగారూలను గాయాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్, పుకోస్కీ అడిలైడ్ టెస్టుకు దూరం కాగా.. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ నుంచి స్టీవ్ స్మిత్ అర్ధాంతరంగా దూరం కావడం కొత్త అనుమానాలకు తావిస్తున్నది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కాంకషన్‌కు గురైన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడటంపై కూడా సందిగ్ధత నెలకొంది.
బుమ్రా ఫిట్‌గా ఉంటేనే..
భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తిరిగి నిలబెట్టుకోవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలకమవుతాడని ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డాడు. ‘బుమ్రాకు నేను పెద్ద అభిమానిని. అతడు ఫిట్‌గా ఉంటే జట్టుకు విజయాలు అందించగలడు. రెండు జట్ల మధ్య ప్రధానమైన తేడా చూపగలడు. గత పర్యటనలో చేసిన ప్రదర్శనను పునరావృతం చేస్తే ఆసీస్‌కు కష్టమే. తొలి టెస్టు అనంతరం కోహ్లీ సిరీస్‌కు దూరమైతే.. కంగారూ బౌలర్లు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు’అని బోర్డర్ పేర్కొన్నాడు.
స్మిత్‌కు గాయం!
ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మంగళవారం జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. సహచరులతో కలిసి మైదానంలోకి వచ్చిన స్మిత్.. పది నిమిషాల్లోనే తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు. గురువారం నుంచి గులాబీ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అంశం ఆసీస్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నది. స్మిత్ ఫిట్‌నెస్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాకున్నా.. ఆసీస్ మీడియా మాత్రం బుధవారం అతడు నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని పేర్కొంది. ఇప్పటికే గాయాల కారణంగా వార్నర్, పుకోస్కీ దూరం కాగా.. స్మిత్ కూడా తొలి టెస్టుకు అందుబాటులో లేకుంటే ఆసీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.
సాహా కంటే పంత్ నయం: గవాస్కర్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా కంటే.. రిషబ్ పంత్‌కే అవకాశం దక్కొచ్చని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘పంత్, సాహాల్లో ఒకరిని ఎంపిక చేయడం కష్టమే. అయినా మేనేజ్మెంట్ పంత్‌వైపే మొగ్గు చూపొచ్చు. గత పర్యటనలో అతడు బ్యాట్‌తోనే కాక.. వికెట్ల వెనుక నుంచి కూడా కంగారూలను బాగా ఇబ్బంది పెట్టాడు. బంతి గింగిరాలు తిరిగే భారత్ వంటి పిచ్‌లపై అయితే వికెట్ల వెనుక సాహా ఉండటమే ఉత్తమం. కానీ కంగారూ గడ్డపై అలాకాదు. ఎక్కువ శాతం పేసర్లే బౌలింగ్ చేస్తారు కాబట్టి బంతిని అందుకునేందుకు తగినంత సమయం లభిస్తుంది. దీంతో పాటు పంత్ జట్టులో ఉంటే బ్యాటింగ్ బలం పెరుగుతుంది’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. మయాంక్‌తో పాటు పృథ్వీ షా కంటే గిల్ ఓపెనర్‌గా దిగే చాన్స్‌లే ఎక్కువున్నాయని సన్నీ అభిప్రాయపడ్డాడు.
ఆ గంట గడిస్తే..
‘సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అందుబాటులో లేకున్నా.. బుమ్రా, షమీ, ఉమేశ్, సైనీ, సిరాజ్ రూపంలో భారత్‌కు 20 వికెట్లు పడగొట్టే బౌలింగ్ దళం ఉంది. బంతితో, బ్యాట్‌తో అశ్విన్ కీలకం కానున్నాడు. పింక్ బంతిని ఆరంభంలో జాగ్రత్తగా ఆడితే ఆ తర్వాత చక్కగా బ్యాట్‌పైకి వస్తుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఓ గంటసేపు బంతిని ఎదుర్కోవడం కాస్త కష్టం’
- రహానే, భారత వైస్‌కెప్టెన్
7 మ్యాచ్‌ల్లో.. 42 వికెట్లు
డే అండ్ నైట్ టెస్టుల్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆడిన స్టార్క్ 19.23 సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు. గులాబీ బంతిపై చక్కటి పట్టు ఉన్న స్టార్క్ జట్టులో ఉండటం ఆసీస్‌కు వెయ్యి ఏనుగుల బలం అని హజిల్‌వుడ్ పేర్కొన్నాడు. అతడే ఆసీస్ అదృష్టమని మాజీలు అభిప్రాయ పడుతున్న వేళ ఈ మ్యాచ్‌లో స్టార్క్ ప్రదర్శన కీలకం కానుంది.
ఆసీస్‌కు రోహిత్
న్యూఢిల్లీ: చివరి రెండు టెస్టుల కోసం టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బయలుదేరాడు. గా యం కారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన హిట్‌మ్యాన్ ఎన్సీఏలో ఫిట్నెస్ పరీక్ష పాసయ్యాక సుదీర్ఘ ఫార్మాట్లో బరిలో దిగనున్నాడు. ఆసీస్ ప్రభుత్వ నిబంధనల ప్రకా రం విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు క్వారంటైన్లో ఉండటం తప్పనిసరి కావడంతో అతడు తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు.
తాజావార్తలు
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
- ‘కిసాన్ ర్యాలీలో అసాంఘిక శక్తులు’