అసలు లోపమెక్కడ?

భారత బౌలింగ్ లైనప్ బలంగా ఉంది’.. నిన్న మొన్నటి వరకు ఎవరి నోట విన్నా ఇదే మాట..!
‘మా బౌలింగ్‌లో పసలేదు’.. రెండో వన్డేలో ఓటమి అనంతరం కెప్టెన్ విరాట్ చేసిన వ్యాఖ్య!
మూడు రోజుల్లోనే ఎంత మార్పు! అత్యుత్తమ బౌలింగ్ దళం కాస్త.. ఆసీస్ గడ్డపై తేలిపోయింది! వికెట్లు తీయాలనే విషయాన్ని పక్కనపెట్టి.. పరుగుల నియంత్రణకే పరిమితమైంది. రెండో వన్డేలో ముగ్గురు ప్రధాన బౌలర్లు తమ కోటా పూర్తి చేయలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే సిరీస్ పరాజయాన్ని కేవలం బౌలింగ్ బృందానికి ఆపాదించి చేతులు దులుపుకుంటే.. పప్పులో కాలేసినట్లే! బౌలర్లు ఇబ్బంది పడుతున్న సమయంలో కనీసం ఫీల్డర్లయినా అద్భుతాలు చేశారా అంటే.. అసలు బంతి ఆపేందుకే మనవాళ్లు నానా తంటాలు పడ్డారు. కాస్తో కూస్తో బ్యాట్స్‌మెన్ ఫర్వాలేదనిపించినా.. ఇటీవలి కాలంలో భారత స్టార్లకు వచ్చిన పేరు ప్రతిష్ఠలతో పోలిస్తే అదీ తక్కువే! ఇదే ఉదాసీనత కొనసాగిస్తే పొట్టి సిరీస్‌తో పాటు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడం కూడా కష్టమే! ఈ నేపథ్యంలో జట్టులో అసలు లోపాలు ఏంటన్న దానిపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:సమవుజ్జీల సమరానికి సమయం ఆసన్నమైందనే కోలాహలం మధ్య మొదలైన భారత్, ఆసీస్ వన్డే సిరీస్ రెండు మ్యాచ్లయ్యేసరికి ఏకపక్షంగా మారిపోయింది. కంగారూలకు పోటీనివ్వలేకపోయిన కోహ్లీసేన వరుస మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ అప్పగించేసింది. అయితే ఈ పరాజయాల కంటే.. మనవాళ్ల బాడీలాంగ్వేజ్ అభిమానులను తీవ్రంగా బాధిస్తున్నది. జట్టులో గెలువాలన్న కసి ఏమాత్రం కనిపించడం లేదు. సైనీ ఆకట్టుకోలేకపోయినా అతడినే కొనసాగించడం, రెండో వన్డే తొలి స్పెల్‌లో బుమ్రాకు కేవలం రెండే ఓవర్లు బౌలింగ్ ఇవ్వడం.. ఇలా కెప్టెన్ కోహ్లీ తప్పుడు నిర్ణయాలకు తోడు బౌలింగ్ వైఫల్యం, బ్యాట్స్‌మెన్ బాధ్యతారాహిత్యం వెరసి జట్టు విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ డేంజర్ బెల్స్‌ను గుర్తించి ఇప్పటికైనా కండ్లు తెరిస్తేనే టీమ్ఇండియా పరువు దక్కుతుంది. లేకపోతే మూడు సిరీస్‌ల్లోనూ ఓడి రిక్తహస్తాలతో వెనుదిరగాల్సిందే!
లాక్డౌన్ ఎఫెక్ట్..
భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరనే ప్రశ్నకు దాదాపు అందరి నుంచి వచ్చే సమాధానం రవీంద్ర జడేజా. అలాంటి జడ్డూ ఆదివారం పోరులో సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. సరే అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందని అనుకుంటే.. మైదానంలో అతడి కదలికలు చూసిన వారెవరికైనా మచ్చుకైనా పాత జడ్డూ కనిపించలేదు. కచ్చితంగా ఆపాల్సిన బంతిని కూడా వదిలేసి అబాసు పాలయ్యాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు ఆరు నెలలు ఇంటికే పరిమితమవడంతో ఆటగాళ్ల శరీర కదలికల్లో వేగం తగ్గిందనుకుందాం. మరి ఐపీఎల్ మ్యాచ్ ప్రాక్టీస్ ఏమైనట్లు? రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ లాంగాన్ నుంచి డైరెక్ట్ త్రోతో వార్నర్‌ను రనౌట్ చేయడం తప్ప భారత ఆటగాళ్లు మైదానంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. రెండో వన్డేలో అయ్యర్, కోహ్లీల క్యాచ్‌లను కంగారూలు అందుకున్న తీరును బట్టి ఆ జట్టుకు మనవాళ్లకు మధ్య ఉన్న తేడా తెలిసిపోతున్నది.
ఫ్రాంచైజీలంటే ప్రాణం పెడుతూ..
ఫ్రాంచైజీ క్రికెట్లో దుమ్మురేపిన మనవాళ్లు జాతీయ జట్టు తరఫున ఆ స్థాయిలో రాణించకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. తాజా ఐపీఎల్‌ను పరిశీలిస్తే.. ఒకరిద్దరు తప్ప విదేశీ ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చోట టీమ్ఇండియా ప్లేయర్స్ విజృంభించారు. అత్యధిక పరుగుల వీరుడు.. సిక్సర్ల ధీరుడు ఇలా ఎందులో చూసినా మనవాళ్లదే పైచేయి. కానీ అదే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వచ్చేసరికి ఆ మెరుపులు కరువయ్యాయి. పంజాబ్ తరఫున సీజన్ మొత్తంలో 13 మ్యాచ్‌లాడి కేవలం 108 పరుగులే చేసిన మ్యాక్స్‌వెల్.. రెండు వన్డేల్లోనూ (19 బంతుల్లో 45, 29 బంతుల్లో 63 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించాడు. మంచి ఆరంభం లభించాక జట్టుకు రాకెట్ వేగాన్ని ఎలా అందించాలో చూపెట్టాడు. రాజస్థాన్ తరఫున టచ్ దొరక్క ఇబ్బంది పడ్డ స్టీవ్ స్మిత్.. పసుపు దుస్తులు వేసుకోగానే పూనకం వచ్చిన వాడిలా విరుచుకుపడ్డాడు. మనవాళ్లలో మాత్రం ఆ తీవ్రత లోపించిందనేది సుస్పష్టం.
జంపాను ఆడలేక..
ఆసీస్ పర్యటనకు ముందు కోహ్లీ వ్యక్తిత్వం చాలా గొప్పది.. అతడు మైదానం బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని ఆకాశానికెత్తిన ఆడమ్ జంపా.. అసలు పోరులో టీమ్ఇండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. స్పిన్ ఆడటంలో సిద్ధహస్తులు అనే పేరున్న భారత ఆటగాళ్లను అతడు క్రీజులో డ్యాన్స్ ఆడించాడు. రెండు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో గొప్పగా పోరాడిన ధవన్, పాండ్యా వికెట్లు కూల్చిన జంపా.. రెండో మ్యాచ్‌లో రాహుల్‌ను ఔట్ చేసి భారత్ పతనాన్ని శాసించాడు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే తొలి వన్డేలో 6 వికెట్లు తీసిన భారత్.. రెండో వన్డేకొచ్చేసరికి 4 వికెట్లతో సరిపెట్టుకుంది. తొలి వన్డేలో బుమ్రా విఫలమైనా మూడు వికెట్లతో ఆకట్టుకున్న షమీ.. రెండో వన్డేలో తనూ అదే బాటలో నడిచాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న చాహల్.. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. యువ పేసర్ సైనీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
రాహుల్.. మర్చిపోయావా..!
‘ఆసీస్ ఓపెనర్ వార్నర్‌కు అయిన గాయం పెద్దదైతే బాగుండు’ఇది భారత అభిమానులు అన్న మాటైతే అర్థం చేసుకోవచ్చు. కానీ టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రాహుల్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సరదాగా అన్నానని అతడు వివరణ ఇచ్చుకున్నా.. ఈ ఒక్క వ్యాఖ్యతో భారత జట్టు మానసిక స్థితి స్పష్టమవుతున్నది. ప్రత్యర్థికి అయిన గాయం ఎక్కువ రోజులు ఉంటే.. దాని వల్ల భారత్‌కు లాభం చేకూరుతుందనే ఆలోచన వచ్చిందంటే నేరుగా కంగారూలను ఢీకొట్టలేమని టీమ్ఇండియా డిసైడ్ అయినట్లా! ఈ సిరీస్‌కు ముందే జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఎంపికైన రాహుల్.. ఇంకా ‘కాఫీ విత్ కరణ్'షో మబ్బులోనే ఉన్నాడని భావించాలా!
హిట్‌మ్యాన్ ఉండుంటే..
ప్రత్యర్థి జట్టులో స్టీవ్ స్మిత్ సెంచరీలపై సెంచరీలు బాదు తూ జట్టుకు మూల స్తంభంలా నిలుస్తుంటే.. మన కెప్టెన్ విరాట్ మాత్రం ఆ పని చేయలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో కంగారూల తరఫున మూడు సెంచరీలు నమోదైతే.. మనవాళ్లలో ఒక్కరు కూడా మూడంకెల మార్క్‌ను అందుకోలేకపోయారు. వార్నర్, ఫించ్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్ నిలకడగా రాణించడం ఆసీస్‌కు కలిసివస్తే.. మనవాళ్లు మ్యాచ్‌కు ఇద్దరు చొప్పున అర్ధశతకాలు చేయడం దెబ్బకొట్టింది. సిరీస్ ఆరంభానికి ముందు అనేక మలుపులు తిరిగిన రోహిత్ శర్మ ఫిట్నెస్ అంశంపై బీసీసీఐ ఏదో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా అదీ పొంతనలేని విషయం మాత్రమే అని తేలిపోయింది. కీలక సిరీస్‌కు అతడు అందుబాటులో లేకపోవడం టీమ్ఇండియాకు శరాఘాతంలా మారిం ది. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న విరాట్‌తో పాటు రోహిత్ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!