మంగళవారం 14 జూలై 2020
Sports - May 04, 2020 , 02:08:54

జట్టంతా ఒక్కటై..దాదాను ఆటపట్టించిన వేళ

జట్టంతా ఒక్కటై..దాదాను ఆటపట్టించిన వేళ

  • గంగూలీని భయపెట్టిన యువీ మాస్టర్‌ ప్లాన్‌
  • టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన సరదా ఘటన

క్రికెటర్ల డ్రెస్సింగ్‌రూమ్‌లో మ్యాచ్‌ల గురించిన వ్యూహ, ప్రతివ్యూహాలు, చర్చోపచర్చలతో పాటు అప్పుడప్పుడూ సరదా విషయాలు జరుగుతుంటాయి. అయితే బయటిప్రపంచానికిచాలా తెలియవు.కాకపోతే కొన్ని సందర్భాల్లో తమ మధ్య ఉన్న స్నేహం, బంధం గురించి చెప్పేందుకు ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన సంఘటనలను బయటపెడుతుంటారు. ఇలానే 2005లో టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన ఓ సరదా ఘటనను అప్పటి స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వెల్లడించడంతో విషయం బయటకు వచ్చింది. ఓ సారి యువీ వేసిన ప్లాన్‌ ప్రకారం జట్టంతా ఏకమై ఏకంగా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీనే ఆటపట్టించింది. ఎంతలా అంటే ఓ దశలో కెప్టెన్సీకి కూడా రాజీనామా చేస్తానని దాదా చెప్పేంతలా. అసలు సౌరవ్‌ అంత భయపడేంత పని యువీ అండ్‌ కో ఆ రోజు ఏం చేసిందంటే.. 

2005 ఏప్రిల్‌లో కొచ్చీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా వన్డే ఆడాల్సి ఉంది. మ్యాచ్‌ కోసం సిద్ధం చేసుకున్న ప్రణాళికలతో కూడిన కాగితాలతో కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మామూలుగానే అడుగుపెట్టాడు. సెహ్వాగ్‌, ద్రవిడ్‌, యువరాజ్‌, హర్భజన్‌ సహా ఆటగాళ్లు,  కోచింగ్‌ సిబ్బంది అక్కడే ఉన్నారు. అందరూ మౌనంగా ఉండడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌ అంతా నిశ్శబ్దం ఆవహించింది. దాదా అంతా సాధారణంగానే ఉంది కదా అని.. తన ప్లాన్‌ వివరించడం మొదలుపెట్టాడు. అంతలో ఆటగాళ్లు గంగూలీకి ఓ న్యూస్‌ పేపర్‌(రాత్రికి రాత్రి ప్లేయర్లు తయారు చేయించింది) చూపించారు. అందు లో జట్టు ఆటగాళ్లను విమర్శిస్తూ సౌరవ్‌ ఇంటర్వ్యూ ఉంది. దీన్ని చూసిన దాదా ఒక్కసారిగా షాకయ్యాడు. అసలేం జరుగుతుందో అర్థంకాక అతడి ముఖం వాడిపోయింది. 

కెప్టెన్సీకి రాజీనామా చేస్తా..

ఆ తర్వాత యువరాజ్‌, సెహ్వాగ్‌, హర్భజన్‌ వైపు గంగూలీ చూశాడు. ప్రతి ఆటగాడి వద్దకు వెళ్లి తాను ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, తనకేం తెలియదని గంగూలీ చెప్పడం ప్రారంభించాడు. ఎవరైనా తనకు మద్దతినిస్తారేమోనని అందరి వైపు చూసినా ఫలితం లేకపోయింది. దీంతో ఏకంగా దాదా కండ్లలో నీళ్లు తిరిగాయి. అయినా ఎవరూ అతడి వద్దకు వెళ్లలేదు. ఆ తర్వాత హర్భజన్‌ సింగ్‌, ఆశిష్‌ నెహ్రా కోపంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో నుంచి బయటకు వెళ్లారు. దీంతో దాదా మరింతగా భయపడిపోయాడు. కావాలంటే కెప్టెన్సీకి రాజీనామా చేస్తానని అందరితో చెప్పాడు. ఆ సమయంలో దాదాను అంత టెన్షన్‌తో చూడలేకపోయిన ది వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రంగ ప్రవేశం చేశాడు. ఇదంతా నిన్ను ఏప్రిల్‌ ఫూల్‌ను చేయడానికి చేశాం అని చెప్పాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న గంగూలీ.. ఆ తర్వాత బ్యాట్‌ పట్టుకొని డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆటగాళ్ల వెంటపట్టాడు. ఇది జరిగిన తర్వాత చాలాసేపటి వరకు ఆటగాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. 2000 సంవత్సరంలో కెన్యాతో అరంగేట్రం మ్యాచ్‌లోనే యువరాజ్‌ను ఓపెనింగ్‌ చేస్తావా అని గంగూలీ ముందు రోజు ఆడిగాడట. అందుకు భయంతోనే యువీ సరేనని చెప్పినా.. తీరా తర్వాతి రోజు జోక్‌ చేశానని దాదా అన్నాడు.  దానికి ప్రతీకారంగానే 2005లో గంగూలీని ఆటపట్టించేందుకు యువీ మాస్టర్‌ప్లాన్‌ అమలు చేశాడు. 

మరోసారి.. 

ఆ తర్వాత కొన్నేండ్లకు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆ రోజు ఇచ్చిన పేపర్‌ లాంటిదే మళ్లీ సౌరవ్‌ గంగూలీ చేతిలో ఆటగాళ్లు పెట్టారట. అయితే దాంట్లో అందరి సంతకాలతో పాటు..  దాదా ఐ లవ్‌ యూ అని రాసి ఉంది. ఆ తర్వాత ఆటగాళ్లందరినీ గంగూలీ కౌగిలించుకున్నాడట. మళ్లీ ఇలా ఎప్పుడూ భయపెట్టవద్దని దాదా అందరికీ చెప్పాడు. ఈ విషయాలను యువీ, సౌరవ్‌తో పాటు మిగిలిన జట్టు సభ్యులు పలుసార్లు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకున్నారు. 


logo