చెన్నై: ఒకరు తమిళులు ఎంతగానో ఆరాధించే స్టార్ హీరో. మరొకరు ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో వారికి దగ్గరై.. అక్కడి వాళ్లతో ముద్దుగా తల అని పిలిపించుకునే క్రికెటర్. ఈ ఇద్దరూ ఒక చోట కలిసి ఫొటోలకు పోజులిస్తే అభిమానులకు పండగే కదా. అందుకే ఇప్పుడు తలపతి విజయ్, తల ధోనీ ( MS Dhoni ) కలిసి దిగిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. చెన్నైలోని గోకులం స్టూడియోలో బీస్ట్ షూటింగ్ కోసం వెళ్లిన విజయ్, కమర్సియల్స్ షూట్లో పాల్గొనడానికి వెళ్లిన ధోనీ కలిశారు. ఒకే స్టూడియోలో ఉన్నామని తెలియడంతో ఈ ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. 2008లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లాంచ్ చేసినప్పుడు విజయ్ ఆ టీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలవడం ఇదే తొలిసారి.
ధోనీ ఫ్రెండ్ సీమంత్ లొహానీ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి క్యాప్షన్ అవసరం లేదు.. తలపతి, తల.. అని లొహానీ ఈ ఫొటోకు కామెంట్ చేశాడు. తమిళ సూపర్‌స్టార్ విజయ్ను అభిమానులు తలపతి అని పిలుస్తారు. అలాగే ధోనీని తల (లీడర్) అని అంటారు. బీస్ట్ షూటింగ్ రెండో షెడ్యూల్ కోసం విజయ్ గోకులం స్టూడియోలో ఉన్నాడు. ఇక ధోనీ ఈ కమర్షియల్ షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఐపీఎల్ కోసం ఈ నెల 13న చెన్నై టీమ్‌తో కలిసి దుబాయ్ వెళ్లనున్నాడు.