బుధవారం 08 జూలై 2020
Sports - Jun 06, 2020 , 17:19:01

లారా ఫస్ట్‌క్లాస్ 501* రికార్డుకు 26ఏళ్లు: వీడియో

లారా ఫస్ట్‌క్లాస్ 501*   రికార్డుకు 26ఏళ్లు: వీడియో

జమైకా:  లెజండరీ క్రికెటర్‌, విండీస్‌ వీరుడు బ్రియాన్‌ లారా సరిగ్గా 26ఏండ్ల క్రితం  అరుదైన రికార్డు నెలకొల్పాడు.  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో చరిత్రలోనే అత్యధిక స్కోరు 501 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్ర  సృష్టించాడు.   1996 జూన్‌ 6వ తేదీన బర్మింగ్‌హామ్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. దుర్హమ్‌తో మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌ తరఫున ఆడిన లారా ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్‌ చేసి ప్రపంచ  దృష్టిని ఆకర్షించాడు.  

ఆంటిగ్వాలో ఇంగ్లాండ్‌పై 375 పరుగుల రికార్డును నమోదు చేసిన రెండు నెలలకే ఈ మైలురాయి అందుకున్నాడు. విండిస్‌ దిగ్గజం లారా తన సంచలన ఇన్నింగ్స్‌తో  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో పాకిస్థాన్‌కు చెందిన హనీఫ్‌ మహ్మద్‌ పేరిట ఉన్న 499 పరుగుల రికార్డును అధిగమించాడు. తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో అతడు 427 బంతుల్లో 62 బౌండరీలు, 10 సిక్సర్లు కొట్టడం విశేషం.  

ప్రపంచ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు 400 నాటౌట్‌తో లారానే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  2004లో ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌ తరఫున విశేషంగా రాణించిన లారా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.  ఓవరాల్‌గా 131 టెస్టులాడిన లారా 11,953 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు, 48 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు 400 నాటౌట్‌ కావడం విశేషం. 
logo