సోమవారం 06 జూలై 2020
Sports - May 21, 2020 , 18:57:24

'సీఎస్‌కేలోకి వస్తే.. కెరీర్‌కు పునర్జన్మ వచ్చినట్టే'

'సీఎస్‌కేలోకి వస్తే.. కెరీర్‌కు పునర్జన్మ వచ్చినట్టే'

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వ లక్షణాలను ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రావో మరోసారి ప్రశంసించాడు. ఆటగాళ్లు ఎప్పుడూ అనుకూలంగా ఫీలయ్యేలా ధోనీ చూసుకుంటాడని ఓ వీడియో చాట్‌లో చెప్పాడు. అలాగే ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడిన ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్‌లు మళ్లీ గాడిలో పడ్డాయని బ్రావో అన్నాడు.

"సీఎస్కేలోకి ప్లేయర్‌ ఎప్పుడు వచ్చినా.. అతడి కెరీర్‌కు మళ్లీ పునర్జన్మ వచ్చినట్టు ఉంటుంది. కొద్ది సంవత్సరాల క్రితం షేన్‌ వాట్సన్‌ను గమనిస్తే తెలుస్తుంది. అలాగే ముంబై నుంచి చెన్నై జట్టులోకి వచ్చాక అంబటి రాయుడిని చూడండి. సూపర్‌ కింగ్స్‌కు వచ్చాక ప్రతీ ఒక్కరి కెరీర్‌ గ్రాఫ్‌ మెరుగైంది" అని బ్రావో చెప్పాడు. అలాగే ధోనీ ఆటగాళ్లపై చూపే నమ్మకాన్ని వివరించాడు. "ధోనీ ఎవరిపై ఒత్తిడి చేయడు. క్రికెట్‌ కాకుండా అతడిని బయట చూడడం అరుదు. కానీ అందరి కోసం అతడి గది తలుపులు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా వెళ్లి మాట్లాడొచ్చు. అతడు బాగా మాట్లాడతాడు. ఆటగాళ్లు ఎంతో అనుకూలంగా, ఊరటగా ఫీలయ్యేలా ధోనీ వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఎన్ని ఘనతలు, విజయాలు సాధించినా అతడు సూపర్‌స్టార్‌లా అసలు ప్రవర్తించడు' అని బ్రావో అన్నాడు.  


logo