మంగళవారం 07 జూలై 2020
Sports - Jun 07, 2020 , 01:23:39

కరోనాతో నిలిచిపోయిన క్రీడా టోర్నీలు

కరోనాతో నిలిచిపోయిన క్రీడా టోర్నీలు

  • పోటీల ప్రారంభంపై తొలగని సందిగ్ధత 

క్రీడలు మన దైనందిన జీవితంలో భాగం. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఏదో ఒక క్రీడలో రాణిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్న వైనం. కానీ కరోనా రంగ ప్రవేశంతో సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది.  ఈ మహమ్మారి ప్రభావంతో రెండు నెలలుగా ప్లేయర్లంతా ఇండ్లకే పరిమితమైన పరిస్థితి.  ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య గడుపుతున్న క్రీడాకారులు ఎప్పుడెప్పుడు స్వేచ్చా విహంగాల్లా ఎగురుదామని చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వగా, క్రీడల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.  ప్రపంచాన్ని మార్చే శక్తి క్రీడలకు ఉందన్న మండేలా వ్యాఖ్యలను సచిన్‌  ఉదహరించిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మొదలవుతాయన్న దానిపై సమగ్ర కథనం. 

‘ప్రపంచాన్ని మార్చే శక్తి క్రీడలకు ఉంది. అంతేకాదు ప్రపంచ దేశాలన్నింటినీ కలిపే బలం క్రీడల సొంతం’ అని నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా దిగ్గజం నెల్సన్‌ మండేలా అన్న మాటలు అక్షర సత్యాలు. క్రీడలనేవి దేశాల మధ్య సరిహద్దులు మార్చడంలోనే కాదు.. సాంస్కృతిక వారధులుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఉద్దేశంతోనే ప్రతి నాలుగేండ్లకోసారి అన్ని దేశాల సమాహారంతో విశ్వక్రీడలను నిర్వహిస్తూ వస్తున్నారు. గ్రీసులోని ఒలింపియా వేదికగా మొదలైన ఒలింపిక్స్‌ శతాబ్దాలు గడుస్తున్నా.. నేటికి వారసత్వ వైభవాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ప్రపంచ మానవాళి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చిన కరోనా వైరస్‌ క్రీడల రూపురేఖలను మార్చేసింది. వైరస్‌ రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ ప్రాణాలను హరించుకుంటూ పోతున్నది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి విశ్వక్రీడలు వైరస్‌ కారణంగా వాయిదా పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒలింపిక్స్‌తోనే ఆగిపోలేదు. సుదీర్ఘ చరిత్ర కల్గిన వింబుల్డన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, టూర్‌ డీ ఫ్రాన్స్‌, ఐపీఎల్‌ ఇలా చెప్పుకుంటూపోతే బారినపడని క్రీడాటోర్నీ లేదు.  ఇప్పటికే కొన్ని దేశాలు కఠిన నిబంధనలు, జాగ్రత్తలతో టోర్నీలను మొదలుపెట్టగా, భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్‌) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. శిక్షణ శిబిరాలు ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై పూర్తిస్థాయి నిర్ణయమేమి తీసుకోలేదు. మార్గదర్శకాల విషయంలో క్రీడలను సాయ్‌ నాలుగు భాగాలుగా విభజించింది. దీన్ని అందరూ తప్పనిసరిగా అనుసరించాలని సూచించింది. లాక్‌డౌన్‌ నిబంధనలపై ఇప్పటికే సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం క్రీడాటోర్నీల విషయంలో స్పష్టతనివ్వలేకపోయింది. 

ఐపీఎల్‌పై గంపెడు ఆశలు: 

క్రికెటర్లంతా ఐపీఎల్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వైరస్‌తో నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌.. ఈ ఏడాదిలో ఎప్పుడు జరిగినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. అయితే ఆస్ట్రేలియా వేదికగా ఆస్ట్రేలియాలో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై ఐపీఎల్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. మెగాటోర్నీ వాయిదా పడితే..ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహించాలన్న పట్టుదలతో బీసీసీఐ కనిపిస్తున్నది. ఈ దిశగా తమ పంతం నెగ్గించుకునేందుకు గంగూలీ సారథ్యంలోని బోర్డు పావులు కదుపుతున్నది. అన్ని అనుకున్నట్లు సాగితే సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఐపీఎల్‌ లీగ్‌ను ఆస్వాదించవచ్చు. 

జరుగకపోతే ఇక అంతే: 

 వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌ జరుగాలి..లేకపోతే ఇంక అంతేనని ఒలింపిక్స్‌ సీనియర్‌ అధికారి పియరీ ఒలీవర్‌ బెకర్స్‌ శనివారం వ్యాఖ్యానించాడు.  logo