రహానే అందుకున్న ఆ మెడల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియాను అద్భుత విజయం వైపు నడిపించిన కెప్టెన్ అజింక్య రహానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా తొలిసారి ప్రవేశపెట్టిన ముల్లాగ్ మెడల్‌ను అతడు అందుకున్నాడు. మ్యాచ్ తర్వాత ఆ మెడల్‌తో రహానే ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ నేపథ్యంలో అసలు ఈ ముల్లాగ్ మెడల్ ఏంటి, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొన్నది.
ముల్లాగ్ మెడల్ ఏంటి?
డిసెంబర్ 21నే బాక్సింగ్ డే టెస్ట్‌లో బెస్ట్ ప్లేయర్‌కు ఈ ముల్లాగ్ మెడల్ ఇవ్వనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మెడల్ జానీ ముల్లాగ్ (అసలు పేరు ఉనారిమిన్) జ్ఞాపకార్థం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ జానీ ముల్లాగ్ 1868లో అబోరిజినల్ ఎలెవన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియా తరఫున తొలిసారి అంతర్జాతీయ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇదే. డిసెంబర్ 28న ముల్లాగ్ను ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ చేర్చారు.
ముల్లాగ్.. వన్ ఆఫ్ ద బెస్ట్
ముల్లాగ్ తన తరం బెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. తన తొలి టూర్లోనే పది సగటుతో 245 వికెట్లు, 23 సగటుతో 1698 పరుగులు చేసిన ఘనత అతని సొంతం. యూకే టూర్‌కు వెళ్లిన టీమ్ తరఫున మొత్తం 47 మ్యాచ్‌లలో 45 మ్యాచ్‌లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. 1866లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లోనూ అబోరిజినల్ టీమ్ తరఫున ముల్లాగ్ ఆడాడు. ఈ గ్రౌండ్‌తో అతనికి ఉన్న అనుబంధం కారణంగానే క్రికెట్ ఆస్ట్రేలియా అతని పేరు మీద మెడల్ బహూకరించాలని నిర్ణయించింది.