సిరాజ్ షాన్‌దార్

- ఐదు వికెట్లతో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్
- టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన
- బ్రిస్బేన్ టెస్టులోకంగారూలకు కళ్లెం
- సత్తా చాటిన శార్దుల్
- ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 298 ఆలౌట్..
- భారత్ లక్ష్యం 328
- వరుణుడి దోబూచులాట
ఆటంటే తనకు ఎంత ప్రాణమో, తన తండ్రి అంటే అంతే ప్రాణం. తనకెంతో ఇష్టమైన క్రికెట్లో వెన్నుతట్టి ప్రోత్సహించిన నాన్న ఇక లేడన్న వార్త అతన్ని హతాశుడిని చేసింది. చివరి చూపు కోసం స్వదేశానికి వద్దామనుకున్నా..తండ్రి చిరకాల కోరిక మేరకు ఆస్ట్రేలియాలోనే ఆగిపోయాడు. ఆటో రిక్షా నడుపుతూ తనను ఇంతవాడిని చేసిన నాన్న ఆశయసాధన కోసం దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ టెస్టుల్లో భారత్‌కు ఆడాలన్న కలను సాకారం చేసుకున్నాడు.
తొలి టెస్టులోనే ఔరా అనిపించిన సిరాజ్.. తన మూడో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. షమీ, బుమ్రా, ఉమేశ్ లాంటి సీనియర్ల గైర్హాజరీతో నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత బౌలింగ్ దళాన్ని మన హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ ముందుండి నడిపించాడు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేశాడు. పేస్ బౌలింగ్‌కు పెట్టని కోట అయిన గబ్బా మైదానంలో సిరాజ్ బెబ్బులిలా గర్జించాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు. ముట్టుకుంటే మసే అన్న రీతిలో కంగారూలకు పట్టపగలే చుక్కలు చూపించాడు.
ఐదు వికెట్లు పడగొట్టి కంగారూల దూకుడుకు కళ్లెం వేశాడు. ఒక ఎండ్‌లో శార్దూల్ ఠాకూర్ చెలరేగితే మరో ఎండ్‌లో సిరాజ్ ఆసీస్ భరతం పట్టాడు. తన తండ్రి ఆశీస్సులతో అత్యుత్తమ ప్రదర్శనతో సత్తాచాటాడు. జాత్యహంకార వ్యాఖ్యలను తనదైన శైలిలో తిప్పికొడుతూ ఆసీస్ అహాన్ని నేలకు దించి దిగ్గజాల మన్ననలు అందుకున్నాడు. కండ్లు చెదిరే స్వింగ్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు కళ్లెం వేసిన మన హైదరాబాదీ భవిష్యత్‌లోనూ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బ్రిస్బేన్: సంప్రదాయ క్రికెట్లో రెండు మేటి జట్ల మధ్య జరుగుతున్న పోరు రసవత్తరంగా సాగుతున్నది. పొట్టి ఫార్మాట్ బాగా ప్రాచూర్యం పొందాక టెస్టు మ్యాచ్ ఐదోరోజు వరకు వెళ్లడమే గగనమనుకుంటే.. ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు పూర్తయినా మొగ్గు ఎటువైపు అంటే చెప్పడం కష్టంగా మారింది. భారత నయా పేసర్లు మహమ్మద్ సిరాజ్ (5/73), శార్దూల్ ఠాకూర్ (4/61) విజృంభించడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (55), డేవిడ్ వార్నర్ (48) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. కంగారూలు టీమ్ఇండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. సోమవారం ఛేదన ప్రారంభించిన భారత్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమి నష్టపోకుండా 4 రన్స్ చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న రహానే సేన విజయానికి చివరి రోజు 324 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు ఆటకు వర్షం పలుమార్లు అడ్డుపడటంతో దాదాపు రెండు గంటల ఆట తుడిచిపెట్టుకుపోయింది. మంగళవారం కూడా వర్ష సూచన ఉండటంతో మరి టీమ్ఇండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. ఒక్క రోజు ఆటే మిగిలిఉన్న మ్యాచ్‌లో మూడు ఫలితాలు వచ్చేందుకు చాన్స్‌లు ఉన్నాయి. ప్రస్తుత మానసిక స్థితిలో భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించాలనే కసితోనే ఉందనేది సుస్పష్టం. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. ఓపెనర్లు తొలి సెషన్ పూర్తిగా ఆడితే రిషబ్ పంత్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ దక్కొచ్చు!
ఆకట్టుకున్న వార్నర్..
ఓవర్‌నైట్ స్కోరు 21/0తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వార్నర్ బౌండ్రీలే లక్ష్యంగా ముందుకు సాగాడు. మరో ఎండ్ నుంచి మార్కస్ హరీస్ (38; 8 ఫోర్లు) అతడికి చక్కటి సహకారం అందించాడు. తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించాక శార్దూల్ ఈ జోడీని విడదీశాడు. పంత్ పట్టిన క్యాచ్‌కు హరీస్ వెనుదిరిగితే.. మరుసటి ఓవర్లోనే వార్నర్‌ను సుందర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్కోరు వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించిన లబుషేన్ (25; 5 ఫోర్లు)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. మరో మూడు బంతుల తర్వాత మాథ్యూ వేడ్‌ను కూడా పెవిలియన్ బాటపట్టించడంతో ఆసీస్ జట్టు 123/4తో నిలిచింది.
నివ్వెరబోయిన స్మిత్
నాలుగు వికెట్లు పడటంతో స్మిత్ నిదానంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (37)తో కలిసి ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. హైదరాబాదీ వేసిన సూపర్ బౌన్సర్‌కు స్మిత్.. రహానేకు క్యాచ్ ఇచ్చాడు. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న స్మిత్ కాసేపు క్రీజులోనే నిల్చొని అలా చూస్తుండిపోయాడు. ఈ క్రమంలో గ్రీన్, పైన్ (27)లను శార్దూల్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆఖర్లో కమిన్స్ (28 నాటౌట్) విలువైన పరుగులు జోడించి ఆధిక్యాన్ని మూడొందలు దాటించాడు. హజిల్‌వుడ్ (9)ను చివరి వికెట్ రూపంలో ఔట్ చేసిన సిరాజ్.. టెస్టుల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన తన పేరిట లిఖించుకున్నాడు.
అమ్మతో మాట్లాడాకే..
నేను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే ప్రపంచం మొత్తం చూడాలని మా నాన్న ఆకాంక్షించేవారు. ఆ కల ఈ రోజు సాకారమైంది. ఆయన దీవెనలతోనే ఈ రోజు ఐదు వికెట్లు పడగొట్టగలిగాను. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. సిరీస్ ప్రారంభానికి ముందు చాలా బాధలో మునిగిపోయా. ఆ సమయంలో అమ్మతో మాట్లాడటంతో నాలో ధైర్యం వచ్చింది. ఈ సిరీస్‌లో నేను పడగొట్టిన వికెట్లలో స్టీవ్ స్మిత్‌దే హైలైట్. లబుషేన్ వికెట్ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యువ ఆటగాళ్లలో ధైర్యం నింపడంలో రహానే భాయ్ ఎప్పుడూ ముందుంటాడు. అందువల్లే నటరాజన్, సుందర్ నేను అవకాశాలను అందిపుచ్చుకోగలిగాం. సిరీస్ గెలువడమే మా లక్ష్యం. ఆటగాళ్ల గాయాలు, ఇన్ని ప్రతికూలతల మధ్య మా జట్టు చక్కటి ప్రదర్శన చేస్తున్నది. నన్ను నేను సీనియర్ బౌలర్‌గా భావించడం లేదు. గ్రౌండ్లో జస్సీ భాయ్ (బుమ్రా)ను చాలా మిస్ అవుతున్నా. అందుకే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేవిధంగా మరింత బాధ్యతతో బౌలింగ్ చేస్తున్నా.
-సిరాజ్
స్వర్గం నుంచి మీ నాన్న ఆశీస్సులతో..
మన హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన అద్భుతం. అదీ వ్యక్తిగత జీవితంలో అనుకోని విషాదం తర్వాత ఇలా ఆడడం సాధారణ విషయం కాదు. నీ బౌలింగ్.. సిరీస్ గెలుపుపై భారత్‌కు నమ్మకాన్ని ఇచ్చింది. నీ ప్రదర్శనతో స్వర్గంలో మీ నాన్న గర్వపడుతూ.. నిన్ను ఆశీర్వదిస్తున్నారని నమ్మకంగా చెప్పగలను.
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369, భారత్ తొలి ఇన్నింగ్స్: 336, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హరీస్ (సి) పంత్ (బి) ఠాకూర్ 38, వార్నర్ (ఎల్బీ) సుందర్ 48, లబుషేన్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 25, స్మిత్ (సి) రహానే (బి) సిరాజ్ 55, వేడ్ (సి) పంత్ (బి) సిరాజ్ 0, గ్రీన్ (సి) రోహిత్ (బి) శార్దూల్ 37, పైన్ (సి) పంత్ (బి) శార్దూల్ 27, కమిన్స్ (నాటౌట్) 28, స్టార్క్ (సి) సైనీ (బి) సిరాజ్ 1, లియాన్ (సి) మయాంక్ (బి) శార్దూల్ 13, హజిల్‌వుడ్ (సి) శార్దూల్ (బి) సిరాజ్ 9, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 294. వికెట్ల పతనం: 1-89, 2-91, 3-123, 4-123, 5-196, 6-227, 7-242, 8-247, 9-274, 10-294, బౌలింగ్: సిరాజ్ 19.5-5-73-5, నటరాజన్ 14-4-41-0, సుందర్ 18-1-80-1, శార్దూల్ 19-2-61-4, సైనీ 5-1-32-0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 4, గిల్ (నాటౌట్) 0, మొత్తం: 4. బౌలింగ్: స్టార్క్ 1-0-4-0, హజిల్‌వుడ్ 0.5-0-0-0.
తాజావార్తలు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్‌నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
- క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతుల దుర్మరణం
- మరో కీలక నిర్ణయం : ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
- ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆఫీసుకెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో