బుధవారం 08 జూలై 2020
Sports - Jun 24, 2020 , 18:16:19

అది పెద్ద వరం: విరాట్ కోహ్లీ

అది పెద్ద వరం: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: భారత్ తరఫున టెస్టుల్లో ప్రాతినిథ్యం వహిస్తుండడం తనకు దక్కిన విలువైన వరం అని టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తెలుపు జెర్సీ వేసుకొని గతంలో టెస్టు ఆడిన ఫొటోలను బుధవారం ట్విట్టర్​లో పోస్ట్ చేసిన కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్​పై తన ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు.

“తెల్ల జెర్సీలో ఉత్కంఠకరమైన మ్యాచ్ ఆడే విషయానికి సాటిగా ఏదీ దరిదాపుల్లోకి రాదు.  భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడుతుండడం గొప్ప వరం” అని విరాట్ ట్వీట్ చేశాడు. కోహ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేసి ఇటీవలే తొమ్మిది ఏండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 86టెస్టులు ఆడిన కోహ్లీ 53.62 సగటుతో 27 శతకాలు సహా మొత్తం 7,240 పరుగులు చేసి.. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా పేరు సంపాదించాడు. గతేడాది పుణెలో దక్షిణాఫ్రికాపై 254పరుగులు చేసి.. తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్​తో కోహ్లీని మాజీలు చాలా మంది పోలుస్తున్నారు. సచిన్ తన కెరీర్​లో అన్ని ఫార్మాట్​లలో కలిపి 100 అంతర్జాతీయ శతకాలతో అద్వితీయమైన రికార్డు సాధిస్తే.. విరాట్ ఇప్పటికే 70సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 


logo