సోమవారం 03 ఆగస్టు 2020
Sports - Jul 13, 2020 , 03:05:16

వారెవ్వా విండీస్‌

వారెవ్వా విండీస్‌

  • ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం
  • బ్లాక్‌వుడ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌

సౌతాంప్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ఆందోళనల మధ్య మొదలైన తొలి సిరీస్‌లో వెస్టిండీస్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ ముగిసిన మొదటి టెస్టులో విండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ ఆటగాడు బ్లాక్‌వుడ్‌ (95; 12 ఫోర్లు) అదరగొట్టడంతో.. 200 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్‌ జట్టు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. గాబ్రియల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఉమ్మిపై నిషేధం విధించడం, ప్రేక్షకులను అనుమతించకపోవడం మినహా ఆటలో పెద్దగా మార్పులు కనిపించలేదు. ఇరు జట్ల  మధ్య రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.

అతనొక్కడే..!

ఇంగ్లిష్‌ పేసర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరగడంతో విండీస్‌ ఒక దశలో 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్‌ (4), హోప్‌ (9), బ్రూక్స్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ దశలో చేజ్‌ (37)తో కలిసి బ్లాక్‌వుడ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇంగ్లండ్‌ పేసర్లు బౌన్సర్లతో పరీక్ష పెడుతున్నా అకుంఠిత దీక్షతో క్రీజులో నిలిచి జట్టును విజయానికి చేరువచేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 284/8తో ఆదివారం ఐదోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 29 పరుగులు జోడించి 313 పరుగుల వద్ద ఆలౌటైంది. కరీబియన్‌ బౌలర్లలో గాబ్రియల్‌కు 5 వికెట్లు దక్కాయి.

కరీబియన్లు కసిగా

బ్యాటింగ్‌ బలం.. బౌలింగ్‌ దళం.. బీభత్సంగా ఉన్న ఇంగ్లండ్‌కు వెస్టిండీస్‌ పోటీఇస్తే అదే ఎక్కువ..! ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందు సగటు క్రీడాభిమానుల ఆలోచన ఇది. కానీ, ఏదో అల్లాటప్పాగా ఇంగ్లండ్‌లో అడుగు పెట్టలేదు.. ఇక్కడికి వచ్చింది సిరీస్‌ నెగ్గేందుకే..! అని వెస్టిండీస్‌ జట్టు ఐదు రోజులు తిరిగేలోపే నిరూపించింది.

ఇటీవలి కాలంలో విండీస్‌ జట్టు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇలాంటి ప్రదర్శన చేసింది లేదు. నాలుగు ధనాధన్‌ షాట్లు ఆడి ఎప్పుడెప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్దామా అనే రీతిలో ఉండేది కరీబియన్ల ఆటతీరు. కానీ జట్టుగా కలిసి ఆడితే వారు ఎలాంటి అద్భుతాలు చేయగలరో ఈ మ్యాచ్‌ మరోసారి రుజువు చేసింది. నెలరోజుల ముందే ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన విండీస్‌ జట్టు.. అప్పటి నుంచి కేవలం ఆటపైనే దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల హవా పెరిగిన తర్వాత వెస్టిండీస్‌ జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన రాలేదంటే అతిశయోక్తి కాదు. బ్యాటింగ్‌ పిచ్‌లపై ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇవ్వడం.. ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీస ప్రతిఘటన లేకుండా చేతులెత్తేయడం. మొత్తంగా మూడు రోజుల్లోనే ఆట ముగించుకొని ఇంటి బాట పట్టడం.. విండీస్‌ జట్టు గత కొన్నేండ్లుగా చేస్తున్నదిదే. కానీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం కరీబియన్లలో కసి కనిపించింది. ‘బ్లాక్‌ లీవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమం కూడా       వాళ్లలో కసి పెంచింది.  జో రూట్‌ గైర్హాజరీలో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకున్న కరీబియన్‌ పేసర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేస్తూ ఫలితాన్ని రాబట్టారు.

తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది మంది ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ వికెట్ల వద్దే (3 బౌల్డ్‌లు, 3 ఎల్బీలు, 3 కీపర్‌ క్యాచ్‌లు) దొరికిపోయారంటే.. విండీస్‌ పేస్‌ దళం ఎంత పకడ్బందీగా బౌలింగ్‌ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి పోరాట పటిమ కనబర్చిన హోల్డర్‌ సేన.. తమ బాదుడును పక్కనపెట్టి క్రీజులో నిలువడంపై దృష్టి పెట్టింది. దీని ఫలితంగానే కీలక ఆధిక్యం దక్కింది. ఇక ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేసినా.. సమిష్టి మంత్రాన్ని జపించిన విండీస్‌ చివరి వరకు పట్టు వీడలేదు. లక్ష్యం 200 దాటితే కరీబియన్లకు కష్టమే అని అంతా ఊహించినా.. అందుకు భిన్నంగా విండీస్‌ విజయ కేతనం ఎగురవేసింది. కండ్ల ముందు ఊరిం చే లక్ష్యం కనిపిస్తున్నా.. ఏమాత్రం తొందరపాటుకు పోకుండా.. నింపాదిగా ఆడుతూ బెన్‌ స్టోక్స్‌కు వేదన మిగిల్చింది.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 204, వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 318, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 313 (క్రాలీ 76, సిబ్లే 50, స్టోక్స్‌ 46; గాబ్రియల్‌ 5/75), వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 200/6 (బ్లాక్‌వుడ్‌ 95, చేజ్‌ 37; ఆర్చర్‌ 3/45).


logo