ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 19, 2021 , 01:05:53

వెల్‌డన్‌ విహారి: మంత్రి కేటీఆర్‌

వెల్‌డన్‌ విహారి: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 18: టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి సోమవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్‌ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన వివరాలను పంచుకున్న విహారి..మంత్రికి బ్యాట్‌ను బహుమతిగా అందజేశాడు. తమను కలవడం, క్రికెట్‌ గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటూ విహారి ట్వీట్‌ చేశాడు. దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ‘దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌, టెస్టు క్రికెట్‌కు నేను వీరాభిమానిని. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో అదీ ద్రవిడ్‌ పుట్టిన రోజు నాడు నీ ప్రదర్శన అద్భుతం. మమ్మల్ని గర్వపడేలా చేశావు’ అంటూ రీట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే విహారితో పాటు బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు శ్రీకృష్ణ ప్రియ, తరుణ్‌ కోన మంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ కుటుంబాలకు ఆప్తుడైన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా పాల్గొని ప్లేయర్లను అభినందించారు. 

VIDEOS

logo