సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 27, 2020 , 13:43:30

కరోనాపై యుద్ధంలో గెలుస్తాం : కపిల్​దేవ్​

కరోనాపై యుద్ధంలో గెలుస్తాం : కపిల్​దేవ్​

న్యూఢిల్లీ: లాక్​డౌన్ నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్​దేవ్​ సూచించాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో స్వీయ నిర్బంధం మానవాళికి ఎంతో ముఖ్యమని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని ఆల్​టైం గ్రేట్ ఆల్​రౌండర్ ధీమా వ్యక్తం చేశాడు.

‘అందరూ ఇండ్లలోనే ఉండాలి. దీనివల్ల.. కరోనా వైరస్​పై ప్రాణాలకు తెగించిపోరాడుతున్న వారికి, ప్రభుత్వాలకు కొంత సాయంగా ఉంటుంది. ఈ నిర్బంధాన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. మీ ప్రపంచం మీ ఇంట్లోనే ఉంది. మీ కుటుంబంలోనే ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం అత్యుత్తమమైన మార్గం’ - కపిల్​దేవ్

ఇండ్లు కూడా శుభ్రం చేస్తున్నా

ఖాళీ సమయాల్లో ఇంట్లో ఏం చేస్తున్నాడో కూడా హర్యానా హరికేన్​ కపిల్ వెల్లడించాడు.

‘నేను ఇండ్లు ఊడుస్తున్నా. గార్డెన్​ను శుభ్రం చేస్తున్నా. నా గార్డెనే ఇప్పుడు నా గోల్ఫ్ కోర్స్​. కుటుంబంతో నేను ఎక్కువ సమయం గడుపుతున్నా. ఇన్నేళ్లు నేను చాలా కోల్పోయింది ఇదే. ఇంట్లో అందరి కోసం వంట కూడా చేస్తున్నా’ - కపిల్​దేవ్ 

భారత సంస్కృతిలోనే పోరాడే సామర్థ్యం దాగి ఉందని కపిల్​దేవ్​  అభిప్రాయపడ్డాడు. కరోనాపై యుద్ధంలో మనం గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయంలో వృద్ధులను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు.

ఇదీ చదవండి : తండ్రితో చాహల్‌ ఫన్నీ టిక్‌టాక్‌ వీడియో


logo