శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 17, 2020 , 18:25:43

రిటైర్మెంట్‌ తరువాత మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాం : రైనా

రిటైర్మెంట్‌ తరువాత మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాం : రైనా

తన చిరకాల మిత్రుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్న విషయం తనకు ముందే తెలుసని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా వెల్లడించాడు. రైనా, ధోని, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, కర్న్ శర్మ ఆగస్టు 14న చెన్నై వెళ్లారు. మరుసటి రోజు ఆగస్టు 15న ధోని తన రిటైర్మెంట్‌ వార్తను సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా,  వెంటనే సురేశ్‌ రైనా రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా రైనా మాట్లాడుతూ పదవీ విరమణ ప్రకటించిన తరువాత తామిద్దరం మనస్పూర్తిగా కౌలిగించుకున్నామన్నాడు. తాను, పియూష్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, కర్న్ అందరం కూర్చొని కెరీర్ల గురించి మాట్లాడుకున్నామని, ఆరోజు రాత్రి ఆనందంగా గడిపామని రైనా చెప్పుకొచ్చాడు.

అయితే శనివారం (ఆగస్టు 15)న రిటైర్మెంట్‌ ప్రకటించాలని తాము ముందే నిర్ణయించుకున్నట్లు రైనా తెలిపాడు. ధోని జెర్సీ నెంబర్‌ 7, తనది 3  రెండు పక్కపక్కన పెడితే 73 అవుతుందని, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొంది 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమకు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే మంచి రోజని భావించినట్లు తెలిపాడు. 

ఇదిలా ఉండగా ధోని తన కెరీర్‌ను 23 డిసెంబర్ 2004లో ప్రారంభించగా, రైనా 30 జూలై 2005లో ప్రారంభించాడు. ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌ను దాదాపుగా కలిసి ప్రారంభించారు. ఐపీఎల్‌లో ఇద్దరు సీఎస్‌కే తరపున ప్రారంభం నుంచి ఆడుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo