శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 15:10:01

అనితర సాధ్యుడు...జాఫర్‌: 12వేల రన్స్‌ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు

అనితర సాధ్యుడు...జాఫర్‌: 12వేల రన్స్‌ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు

రంజీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో జాఫర్‌ తర్వాతి స్థానాల్లో దేవేంద్ర బుందేల(145), అమోల్‌ ముజుందర్‌(136) ఉన్నారు.

ముంబై: భారత వెటరన్‌ బ్యాట్స్‌మన్‌, మాజీ ఇండియా ఓపెనర్‌ వసీం జాఫర్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 12000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ అరుదైన ఘనత సాధించాడు.  రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం విశేషం.  రంజీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో జాఫర్‌ తర్వాతి స్థానాల్లో దేవేంద్ర బుందేల(145), అమోల్‌ ముజుందర్‌(136) ఉన్నారు.  జాఫర్‌ చివరిసారిగా 2008లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై, విదర్భ తరఫున వసీం మ్యాచ్‌లు ఆడాడు. రంజీల్లో మొత్తం 40 సెంచరీలు సాధించాడు.   ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితులయ్యాడు. 

దేశవాళీ దిగ్గజం..

రంజీ ట్రోఫీలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ తరఫున ఆడుతున్న జాఫర్‌ మంగళవారం ఈ మైలురాయిని చేరుకున్నాడు.  2019-20 సీజన్‌ ఆరంభానికి ముందు రంజీల్లో జాఫర్‌ ఖాతాలో 11,775 పరుగులు ఉన్నాయి. సీజన్‌ ఆరంభంలో 150వ రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడి చరిత్ర సృష్టించాడు. 1996-97లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్‌ క్రికెట్‌పై మక్కువతో  కుర్రాళ్లతో పోటీ పడుతూ పరుగులు సాధిస్తూనే ఉన్నాడు.  దేశవాళీ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్‌గా నిలిచాడు. భారత్‌ తరఫున జాఫర్‌ 31 టెస్టులు, రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో వెస్టిండీస్‌(212), పాకిస్థాన్‌పై(202) ద్విశతకాలు బాదాడు. 


logo