ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 03, 2020 , 02:16:15

చెన్నైపై నెగ్గిన వార్నర్‌ సేన.. రాణించిన ప్రియమ్‌, అభిషేక్‌

చెన్నైపై నెగ్గిన వార్నర్‌ సేన.. రాణించిన ప్రియమ్‌, అభిషేక్‌

టాపార్డర్‌ తడబడ్డా.. మిడిల్‌ఆర్డర్‌ దుమ్మురేపడంతో మంచి స్కోరు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. బౌలింగ్‌లో సమిష్టిగా సత్తాచాటి లీగ్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విలియమ్సన్‌ను రనౌట్‌ చేయించి అభిమానుల నుంచి తిట్లు తిన్న ప్రియమ్‌ గార్గ్‌ ఆ తర్వాత మెరుపులతో ఆఖరికి హీరోగా నిలువగా.. లీగ్‌లోనే అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ధోనీతో పాటు ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లాడిన జడేజా తొలి అర్ధశతకం సాధించినా.. వారి పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. 

దుబాయ్‌: యువ ఆటగాళ్ల దూకుడైన బ్యాటింగ్‌కు.. అనుభవజ్ఞుల నిలకడైన బౌలింగ్‌ తోడవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చక్కటి విజయం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 7 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. యువ భారత కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌ (26 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో మెరువగా.. అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐపీఎల్‌లోనే తొలి అర్ధశతకం సాధించగా.. మహేంద్రసింగ్‌ ధోనీ (36 బంతు ల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్స ర్‌) రాణించాడు. ప్రియం గార్గ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

ఆరంభంలో వెనుకబడ్డా..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే బెయిర్‌స్టో (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యత వార్నర్‌ భుజానపడింది. పాండే (21 బంతుల్లో 29, 5 ఫోర్లు) అతడికి చక్కటి సహకారం అందించాడు. రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించాక పాండే ఔట్‌ కాగా.. 11వ ఓవర్లో సన్‌రైజర్స్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. చావ్లా బంతిని భారీ షాట్‌ కొట్టేందుకు యత్నించిన వార్నర్‌ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు).. డుప్లెసిస్‌ బౌండ్రీపై పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరగగా.. ప్రియం గార్గ్‌ అలసత్వానికి విలియమ్సన్‌ వికెట్‌ కోల్పోయాడు. మిడ్‌వికెట్‌ వైపు బంతిని కొట్టిన విలియమ్సన్‌ సింగిల్‌ కోసం ముందుకు రాగా.. గార్గ్‌ నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌ నుంచి కదలకుండా ఉండిపోయాడు. దీంతో చేసేదేం లేక విలియమ్సన్‌ తిరిగి క్రీజులోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. ఈ లోపు రాయుడు విసిరిన త్రోను అందుకున్న ధోనీ వికెట్లను గిరాటేశాడు. ఫలితంగా 11 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ 69/4తో నిలిచింది. వార్నర్‌, బెయిర్‌స్టో, పాండే, విలియమ్సన్‌ పెవిలియన్‌ చేరడంతో ఇక హైదరాబాద్‌ కష్టాలు తప్పవని భావిస్తే.. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు. 

ధోనీ, జడేజా సత్తా సరిపోలేదు

ఛేజింగ్‌లో చెన్నై టాపార్డర్‌ తడబడింది. వారం రోజుల విరామం తర్వాత పూర్తి బలగంతో బరిలో దిగిన ధోనీ సేన ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. భువనేశ్వర్‌ అద్భుత ఇన్‌స్వింగర్‌తో వాట్సన్‌ (1) ను పెవిలియన్‌కు పంపగా.. అంబటి రాయుడు (8)కు నటరాజన్‌ డగౌట్‌ దారి చూపెట్టాడు. డుప్లెసిస్‌ (22) రనౌట్‌ కాగా.. కెదార్‌ జాదవ్‌ (3) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఫలితంగా 42 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన చెన్నై.. ధోనీ, జడేజా పోరాడినా రన్‌రేట్‌ పెరిగి పోవడంతో సూపర్‌కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. గాయం కారణంగా భువనేశ్వర్‌ కుమార్‌ తన కోటా పూర్తి చేయలేకపోవడంతో ఆఖర్లో కొంత ఉత్కంఠ నెలకొన్నా చివరకు హైదరాబాద్‌దే పైచేయి అయింది. 36 బంతుల్లో 94 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ, జడేజా హైదరాబాద్‌ను భయపెట్టారు. 

సు‘ప్రియమ్‌' 

అప్పటికే విలియమ్సన్‌ను రనౌట్‌ చేయించిన బాధలో ఉన్న గార్గ్‌.. తన కసినంతా బ్యాటింగ్‌లో చూపెట్టాడు. అతడికి అభిషేక్‌ శర్మ చక్కటి సహకారం అందించాడు. జడేజా ఓవర్‌లో అభిషేక్‌ 6, 4 బాదితే.. సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో ప్రియమ్‌ 4,4,6,4 అరుసుకున్నాడు. ఐదో వికెట్‌కు 77 పరుగులు చేశాక అభిషేక్‌ ఔటైనా.. గార్గ్‌ విలువైన పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ప్రియమ్‌ 23 బంతుల్లో లీగ్‌లో తొలి అర్ధశతకం సాధించాడు. దీంతో ఆరంభంలో అతడిపై అసహనం వ్యక్తం చేసిన సహచరులు కూడా లేచి నిలబడి చప్పట్లతో గార్గ్‌ను అభినందించడం కొసమెరుపు.