e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home Top Slides ఓరుగల్లులో క్రీడాపండుగ

ఓరుగల్లులో క్రీడాపండుగ

  • నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌
  • రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు

వరంగల్‌, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారిత్రక నగరం ఓరుగల్లు మరో గొప్ప వేడుకకు వేదిక కాబోతున్నది. 60వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు వరంగల్‌ మహానగరంలో జరుగబోతున్నాయి. బుధవారం మొదలయ్యే ఈ క్రీడా పండుగ ఈనెల 19న ముగియనుంది. వరంగల్‌ వేదికగా జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు జరుగడం ఇది రెండో సారి కావడం విశేషం. గతం (2020)లో క్రాస్‌ కంట్రీ చాంపియన్‌షిప్‌ పోటీలకు వరంగల్‌ ఆతిథ్యమిచ్చింది. ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ విషయానికొస్తే 47 క్రీడా ఈవెంట్లలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 519 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. మొత్తంగా ఐదు రోజుల పాటు వరంగల్‌ నగరం క్రీడా పండుగతో తళుకులీననుంది. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల కోసం హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌), నిట్‌ స్టేడియం సర్వహంగులతో సిద్ధమయ్యాయి. టోర్నీ నిర్వహణ కోసం జేఎన్‌ఎస్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రూ.7.80 కోట్లతో సింథటిక్‌ ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ సౌకర్యం వరంగల్‌లోనే ఉంది. ట్రాక్‌ వలన అథ్లెట్ల అత్యుత్తమ ప్రతిభ వెలుగులోని రానుంది. ట్రాక్‌ మధ్యలో 22 వేర్వేరు క్రీడల నిర్వహణకు అనువుగా ఏర్పాట్లు చేశారు. సింథటిక్‌ ట్రాక్‌తో పాటు రూ.2 కోట్లతో జేఎన్‌ఎస్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. చుట్టూ ఫెన్సింగ్‌తో పాటు ప్రహారీ, గార్డెనింగ్‌, డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపర్చారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) స్టేడియంలో 20కి.మీ, 35కి.మీ, 50కి.మీ రేసు పోటీలు జరుగుతాయి.

తెలంగాణ నుంచి 17 మంది

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ నుంచి 17 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. వీరిలో యువ అథ్లెట్లు అగసర నందిని, జివాంజీ దీప్తి, హారికా దేవి ఉన్నారు. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో సత్తాచాటాలన్న పట్టుదలతో వీరంతా కనిపిస్తున్నారు. జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ శిక్షణలో రాటుదేలుతున్న వీరంతా..జాతీయ టోర్నీలో రాణించడం ద్వారా మరోమారు తమ ప్రతిభను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ రేస్‌ వాకర్‌ భావ్న జాట్‌, రేవతి ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. 43 మంది మహిళా అథ్లెట్లు సహా 87 మందితో రైల్వేస్‌ భారీ బలగంతో పోటీకి సై అంటుండగా, సర్వీసెస్‌(57 మంది), ఆల్‌ఇండియా పోలీస్‌(50 మంది) జట్లు సవాలుకు సిద్ధమంటున్నాయి. టోక్యో విశ్వక్రీడల్లో పాల్గొన్న చాలా మంది అథ్లెట్లు విశ్రాంతికి మొగ్గుచూపగా, ఆసియాగేమ్స్‌(2018) ట్రిపుల్‌ జంప్‌ స్వర్ణ పతక విజేత అర్పిందర్‌సింగ్‌, షణ్ముగ శ్రీనివాస్‌(200మీ), మహమ్మద్‌ అనీస్‌, శేఖర్‌సింగ్‌, ప్రియాంక, అబ్దుల్‌ గఫూర్‌(లాంగ్‌జంప్‌), హిమశ్రీ రాయ్‌, కనిమోళిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిపురకు చెందిన 14 ఏండ్ల ప్రియాంక భౌమిక టోర్నీలో అతిపిన్న వయసు అథ్లెట్‌గా నిలిచింది.

నెగెటివ్‌ రిపోర్టు ఉండాల్సిందే..

- Advertisement -

కరోనా నేపథ్యంలో నేషనల్‌ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల నిర్వహణలో జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య(ఏఎఫ్‌ఐ) కఠిన నిబంధనలు పెట్టింది. కరోనా పరీక్షలు చేసుకుని నెగెటివ్‌ రిపోర్టు ఉన్న ప్లేయర్లనే పోటీలకు అనుమతిస్తున్నది. పోటీలకు 72 గంటల లోపు కరోనా వైరస్‌ నిర్ధారణ రిపోర్టును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

క్రీడా హబ్‌గా వరంగల్‌

నేషనల్‌ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలతో వరంగల్‌ మహానగరానికి కొత్త గుర్తింపు వచ్చింది. సీఎం కేసీఆర్‌ కృషితో వరంగల్‌ క్రీడల హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో జేఎన్‌ఎస్‌లో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటైంది. ఈ పోటీల నిర్వహణతో ఎందరో ప్లేయర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది. పోటీల కోసం వచ్చే క్రీడాకారులు, కోచ్‌ల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. వారు జిల్లాలోని పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు కూడా ఏర్పాట్లు చేశాం.

వినయ్‌భాస్కర్‌, ఆర్గనైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌

ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు

వరంగల్‌ నగరంలో జరుగనున్న జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఆతిథ్యాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక బృందాలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిర్వాహక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ చైర్మన్‌గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ వైస్‌ చైర్మన్‌గా, అధ్యక్షుడిగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సజ్జనార్‌, ఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ తరుణ్‌ జోషి, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా రాష్ట్ర అథ్లెటిక్స్‌ కార్యదర్శి సారంగపాణి, జిల్లా క్రీడా, యువజన అధికారి గుగులోతు అశోక్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana