సమర సన్నాహం

- నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా-ఏ మధ్య వామప్ మ్యాచ్
- గులాబీ బంతితో డే అండ్ నైట్ పోరు
సిడ్నీ: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే అసలైన గులాబీ బంతి సమరానికి ముందు టీమ్ఇండియా ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. ఆసీస్-ఏతో శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానున్న మూడు రోజుల డే అండ్ నైట్ వామప్ మ్యాచ్‌లో సత్తాచాటి, పూర్తిగా రెడీ అవ్వాలని భారత్ పట్టుదలగా ఉంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో తొలి డే అండ్ నైట్ మ్యాచ్ జరుగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమ్ఇండియా మొదటి గులాబీ బంతి పోరుతోనే శుభారంభం చేయాలని కసి మీద ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా రాత్రి వేళలో పింక్ బంతిని సమర్థంగా ఎదుర్కోవడాన్ని వామప్ మ్యాచ్‌లో అలవాటు చేసుకోవాలని బ్యాట్స్‌మెన్ భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోననేలా కోహ్లీ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు.
జట్టు కూర్పు ఎలా..
తొలి వామప్ మ్యాచ్‌లో భారత్-ఏ తరపున ఓపెనర్లు పృథ్వీషా, శుభ్‌మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్ల స్వింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. టెస్టు సిరీస్‌కు ముందు నిరూపించుకునేందుకు వారికి ఇది మరో అవకాశం. మరోవైపు ఈ గులాబీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఆడే అవకాశం కూడా ఉంది. ఆసీస్ గడ్డపై ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలా.. ఆరో బౌలర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలా అని టీమ్ఇండియా ఆలోచిస్తున్నది. అయితే ఆఫ్‌స్పిన్ వేయగలిగే హనుమ విహారిని తీసుకుంటే బ్యాటింగ్ బలంగా ఉంటుందని, టెస్టు జట్టు కూర్పుపై ఈ మ్యాచ్‌తో స్పష్టత తీసుకురావాలని భారత యాజమాన్యం భావిస్తున్నది. ఇక గత వామప్ మ్యాచ్‌లో శతకంతో ఆకట్టుకున్న అజింక్య రహానే.. కెప్టెన్‌గానూ మంచిమార్కులే కొట్టేశాడు. కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా అర్ధశతకంతో రాణించడం శుభపరిణామం. బౌలర్ల విషయానికి వస్తే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ ఆడనున్నారు.
గ్రీన్, స్వెప్సన్పైనే దృష్టి
ఆసీస్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన కామెరూన్ గ్రీన్పైనే అందరి దృష్టి ఉండనుంది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ తరఫున శతకంతో అదరగొట్టిన అతడు భారత్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైన జట్టులో లేడు. ఈ గులాబీ వామప్ మ్యాచ్‌లో సత్తాచాటి తదుపరి మ్యాచ్‌లకు జట్టులో చోటు దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు టీ20 సిరీస్‌లో అదరగొట్టిన లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ సైతం ఇదే ఆశతో బరిలోకి దిగనున్నాడు. హెడ్‌కోచ్ లాంగర్, కెప్టెన్ టిమ్‌పైన్‌ను ఆకట్టుకొని సుదీర్ఘ ఫార్మాట్ జట్టులో చోటు కొట్టేయాలని ఆశతో ఉన్నాడు.