శనివారం 04 జూలై 2020
Sports - Jun 01, 2020 , 19:06:37

అఫ్రిది, గంభీర్‌ తగ్గితేనే మంచింది: వకార్‌

అఫ్రిది, గంభీర్‌ తగ్గితేనే మంచింది: వకార్‌

న్యూఢిల్లీ: మాజీ కికెటర్లు గౌతమ్‌ గంభీర్‌, షాహిద్‌ అఫ్రిది సామాజిక మాధ్యమాల్లో వాగ్వివాదాలను ఆపేస్తే మంచిదని పాక్‌ బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ సూచించాడు. సోషల్‌ మీడియాలో కాస్త విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. క్రికెట్‌ ఆడుతున్నప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కాన్‌పూర్‌ వన్డే సందర్భంగా మైదానంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. భారత రాజకీయ అంశాలపై అఫ్రిది అవాకులు చవాకులు పేలడం.. దానికి గౌతీ దీటుగా బదులివ్వడం చాన్నాళ్లుగా కొనసాగుతూ వస్తున్నది. అయితే ఇటీవల ఇరుదేశాల సరిహద్దు వద్ద పాక్‌ భద్రతా బలగాలతో కలిసి అఫ్రిది మీతిమీరిన వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మెదడు కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించాడు. దీంతో యావత్‌ క్రీడాలోకం అఫ్రిది మాటలను తప్పుపట్టింది. యువరాజ్‌, హర్భజన్‌ కూడా ఈ అంశంపై స్పందించగా.. గంభీర్‌ మరో అడుగు ముందుకేసి షాహిద్‌ను కడిగిపారేశాడు. 

అయితే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో ఏండ్లు జట్టుకు సేవలందించిన ఇలాంటి ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం సరైన విషయం కాదని దిగ్గజ వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు. ప్రపంచమంతా గమనిస్తున్న వేళ.. కాస్త జాగురుకతతో మెలగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ‘చాన్నాళ్లుగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. దాన్ని ఏదో ఒక స్థాయిలో ఆపేయాల్సిన అవసరం ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఇలా సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదానికి దిగడం మంచిది కాదు. ఇద్దరూ సంయమనం పాటిస్తూ.. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగడం లేదు. దీనిపై ఇరుదేశాల క్రీడాభిమానులను ప్రశ్నిస్తే.. అందులో 95 శాతం మంది భారత్‌, పాక్‌ ఆడితే చూడాలనుకుంటున్నామనే సమాధానమిస్తారు. దానికి ‘ఇమ్రాన్‌-కపిల్‌’ సిరీస్‌ లేదా ఇండిపెండెన్స్‌ సిరీస్‌ అని పేరు పెడితే బాగుంటుంది’ అని వకార్‌ చెప్పుకొచ్చాడు.  


logo