శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 12:45:51

ప్రపంచకప్ ఆడాలనుంది: ఇషాంత్

ప్రపంచకప్ ఆడాలనుంది: ఇషాంత్

బెంగళూరు: టీమ్​ఇండియా వన్డే జట్టులోకి మళ్లీ రావాలనుకుంటున్నట్టు పేసర్ ఇషాంత్ శర్మ మనసులో మాట చెప్పాడు. టెస్టు ఫార్మాట్​లో భారత స్టార్ పేసర్​గా కొనసాగుతున్న ఇషాంత్​కు పరిమిత ఓవర్ల క్రికెట్​లో మాత్రం చోటు దక్కడం లేదు. చివరగా 2016 జనవరిలో ఇషాంత్ వన్డే ఆడాడు. కాగా ఇప్పుడు మళ్లీ వన్డేలు ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్​లో ఆడాలని అనుకుంటున్నట్టు క్రిక్​ఇన్ఫో వీడియో కాస్ట్​లో దీప్​దాస్ గుప్తాతో మాట్లాడుతూ ఇషాంత్ చెప్పాడు.

“ప్రపంచకప్​లో ఆడడాన్ని నేను ఇష్టపడతా. ప్రపంచకప్ విజేతగా నిలిచే జట్టులో భాగం కావాలనుకుంటున్నా. అదో ప్రత్యేకమైన అనుభూతి. ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్​షిప్ ఆడుతున్నా. అది కూడా టెస్టుల్లో విశ్వటోర్నీతో సమానమే. కానీ టెస్టు చాంపియన్​షిప్​ను ఎక్కువ మంది ఫాలోకారు. అయితే వన్డే ప్రపంచకప్​ను అనేక మంది ఫాలో అవుతారు. చాలా ఫేమస్​” అని ఇషాంత్ శర్మ చెప్పాడు. కాగా కెరీర్​లో తనను టీమ్​ఇండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో ప్రోత్సహించాడని అతడు వెల్లడించాడు.  ఇప్పటి వరకు 97 టెస్టులు ఆడిన ఇషాంత్​ 300 వికెట్ల క్లబ్​లో చేరేందుకు మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 80 వన్డేలు ఆడిన ఇషాంత్​ 115వికెట్లు తీసుకున్నాడు. 


logo