మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 18:27:41

తెల్లవారుజాము 3 గంటలకే లేచి.. విరాట్‌ భాయ్‌ను నిద్ర లేపాలనుకున్నా : కుల్దీప్‌ యాదవ్‌

తెల్లవారుజాము 3 గంటలకే లేచి.. విరాట్‌ భాయ్‌ను నిద్ర లేపాలనుకున్నా : కుల్దీప్‌ యాదవ్‌

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌లో తన ఆరంగేట్రం గురించి అనుభవాలను పంచుకున్నాడు. 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన కుల్దీప్‌.. నాల్గో టెస్ట్ మ్యాచ్‌లో 4-68తో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

‘ఇది ఒక గౌరవం! నేను మూడు మ్యాచ్‌లకు బెంచ్‌లో ఉన్నాను. కానీ నాలుగో మ్యాచ్‌కోసం సిద్ధం కమ్మని కోచ్‌ అనిల్‌ కుంబ్లే సర్‌ నాకు చెప్పారు.  ఆయన నాకు చాలా మద్దతు ఇచ్చారు. యువ స్పిన్నర్లు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో ఆయనకు బాగా తెలుసు.’ అని కుల్దీప్‌ అన్నాడు. 

‘మీరు రేపు మ్యాచ్‌ ఆడుతున్నారు. మీ నుంచి 5 వికెట్లు కోరుకుంటున్నాను.. అని అనిల్‌ సార్‌ చేప్పినప్పుడు ముందు నేను భయపడ్డాను. ముందురోజు 9 గంటలకే నిద్రపోయి.. తెల్లవారుజాము 3గంటలకే లేచాను. ఆ సమయంలో నేను గందరగోళంలో ఉన్నాను.. పక్కనే పడుకున్న విరాట్‌ భాయ్‌ను నిద్ర లేపుదామని అనుకున్నా.. కానీ అతడు నాపై కోప్పడతాడని గ్రహించి లేపకుండా మళ్లీ నిద్రలోకి జారుకొని తిరిగి 6 గంటలకు లేచాను.’ అని కుల్దీప్‌ అన్నాడు. 

‘మరుసటి రోజు గ్రౌండ్‌లో అడుగు పెట్టి సెంచరీ మార్కును దాటిన డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ల భాగస్వామ్యాన్ని విడదీశాను. ఆరోజు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, గ్లెన్ మాక్స్‌వెల్‌, పాట్ కమ్మిన్స్‌తో పాటు మొత్తంగా 4 వికెట్లు తీయడంతో నా కల నెరవేరింది. నా మొదటి రోజు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గాను నేను ఆరోజు రాత్రి చాలా ఎమోషనల్‌ అయ్యాను.’ అని కుల్దీప్‌ యాదవ్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. 

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo