ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ఎంత ముఖ్యమైందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అలాంటి ఓటు వేయడానికి అండర్వేర్లో వచ్చారు చాలా మంది యువత. ఈ దృశ్యం ఆస్ట్రేలియాలో పలుచోట్ల కనిపించింది. దీని వెనుక కారణం ఏంటంటే.. స్థానికంగా ఉన్న బడ్జీ స్మగ్లర్ అనే కంపెనీ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టు చేసింది.
‘‘తోటి ఆస్ట్రేలియన్లలారా.. దేశంలో ఎలక్షన్లు మంచి ఎండల్లో వస్తున్నాయి. మీరు ఎవరికి ఓటేసినా మేం అడగం కానీ.. చట్టప్రకారం అండర్వేర్లో ఓటు వేయొచ్చనే హక్కును ఉపయోగించుకోవాలని మాత్రం పిలుపునిస్తున్నాం. మిమ్మల్ని ప్రోత్సహించడానికి.. ఎవరైనా సరే ఇలా అండర్వేర్లో ఓటు వేస్తే.. ఆ ఫొటో తీసి #SmugglersDecide హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయండి. అలా చేసిన వాళ్లకు 65 డాలర్ల విలువైన కొత్త జత స్విమ్‌వేర్ పంపుతాం’’ అని ప్రకటించింది.
ఇది బాగా ట్రెండ్ అవడంతో చాలా మంది యువత అండర్వేర్లో వచ్చి ఓట్లు వేశారు. ‘‘ఈ ఎన్నికలకు మా కంపెనీలో చాలా ఖర్చయ్యేలా ఉంది. ఎవరో ఒకరిద్దరు అలా ఓట్లు వేస్తారనుకున్నాం. కానీ ఇంత మంది ఇలా చేస్తారని అనుకోలేదు’’ అని బడ్జీ స్మగ్లర్ కంపెనీ ఆ తర్వాత పోస్టు చేసింది. ఫ్రీగా వచ్చే స్విమ్ వేర్ కోసమే జనాలు ఇలా అండర్వేర్లో ఓట్లు వేశారన్నమాట.