శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 14, 2020 , 00:51:22

నీళ్లలో ఉన్నంతవరకే.. చేప బతుకు

 నీళ్లలో ఉన్నంతవరకే.. చేప బతుకు

-నాలుగు రోజుల టెస్టులపై సెహ్వాగ్‌ స్పందన

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టులపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, విరాట్‌ కోహ్లీలాంటి దిగ్గజ ఆటగాళ్లు.. టెస్టు క్రికెట్‌ను అలాగే కొనసాగించాలని కోరుతుండగా.. తాజాగా ఆ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా చేరిపోయాడు. ప్రతి అంశంపై తనదైన స్టయిల్‌లో పంచ్‌లు విసిరే వీరూ.. నాలుగు రోజుల టెస్టులను కూడా అలాగే చమత్కరించాడు. బీసీసీఐ అవార్డు ప్రదానోత్సవంలో పటౌడి స్మారక ఉపన్యాసం ఇచ్చిన వీరూ.. ‘చార్‌ దిన్‌ కీ చాంద్‌నీ హోతీ హై, టెస్ట్‌ మ్యాచ్‌ నహీ (నాలుగు రోజుల వెన్నెల ఉంటుంది. కానీ, టెస్టు మ్యాచ్‌లు ఉండవు).. జల్‌ కీ మఛ్‌లీ జల్‌ మే హీ అచ్ఛీ హై, బాహర్‌ నికాలోగే తో మర్‌ జాయేగీ (నీటిలో ఉన్నంత వరకే చేప బతికి ఉంటుంది. ఒక్కసారి దాన్ని బయటకు తీస్తే చచ్చిపోతుంది). టెస్టు క్రికెట్‌ను చంద్రుడి దగ్గరకు తీసుకెళ్లొచ్చు. అంటే డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు ఎక్కువ నిర్వహించొచ్చని నా ఉద్దేశం. అంతేకాని ఒకరోజును తగ్గించి సంప్రదాయ క్రికెట్‌లోని ఆత్మను చంపేయొద్దు. 142 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్‌లో ఇటీవల చెప్పుకోదగ్గ మార్పులు చూశాం. కానీ రోజులు తగ్గించడం అనేది సరైంది కాదు’ అని పేర్కొన్నాడు.


logo