శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 04, 2020 , 02:46:48

రాజస్థాన్‌పై విరాట్‌ సేన ఘన విజయం

రాజస్థాన్‌పై విరాట్‌ సేన ఘన విజయం

  • రాణించిన విరాట్‌, పడిక్కల్‌   l   తిప్పేసిన చాహల్‌

చాన్నాళ్ల తర్వాత రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి ఓ చక్కటి ఇన్నింగ్స్‌ జాలువారడంతో బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. స్మిత్‌, బట్లర్‌, శాంసన్‌ విఫలమైన వేళ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ తలా కొన్ని పరుగులు చేసి మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. విరాట్‌ విజృంభణకు పడిక్కల్‌ తోడవడంతో బెంగళూరు అలవోకగా గెలుపొందింది. 

అబుదాబి: సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. లోమ్రర్‌ (39 బంతుల్లో 47; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ 3, ఉడాన 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోహ్ల్లీ సేన 19.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసింది. కోహ్లీ (53 బంతుల్లో 72 నాటౌట్‌;  7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా.. దేవదత్‌ పడిక్కల్‌ (45 బంతుల్లో 63; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) లీగ్‌లో మూడో అర్ధశతకం సాధించాడు. యుజ్వేంద్ర చాహల్‌ (3/24)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

కోహ్లీ కమాల్‌..

టార్గెట్‌ పెద్దది కాకపోవడంతో బెంగళూరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగింది. ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ (8) ఆరంభంలోనే ఔటైనా.. పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో బాదే బాధ్యత పడిక్కల్‌ తసుకోగా.. క్రీజులో కుదురుకున్నాక కోహ్లీ బ్యాట్‌కు పనిచెప్పాడు. గత మూడు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కోహ్ల ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఈ క్రమంలో పడిక్కల్‌ 34 బంతుల్లో అర్ధశతకం సాధించగా.. కోహ్లీ 41 బంతుల్లో మైలురాయిని దాటాడు. రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించాక పడిక్కల్‌ ఔటైనా.. ఏబీ డివిలియర్స్‌ (12 నాటౌట్‌)తో కలిసి విరాట్‌ మిగిలిన పని పూర్తిచేశాడు. 

చాహల్‌ మ్యాజిక్‌..

టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్మిత్‌ నిర్ణయం తప్పని తేలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పవర్‌ ప్లే ముగియక ముందే బట్లర్‌ (22), స్మిత్‌ (5), శాంసన్‌ (4) పెవిలియన్‌ చేరిపోయారు. దీంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ ఇక ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. లోమ్రర్‌ క్రీజులో కుదురుకోగా.. ఊతప్ప (17) పెద్ద గా ఆకట్టుకోలేకపోయాడు. రియాన్‌ పరాగ్‌ (16) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. చాహల్‌ తన స్పిన్‌తో రాయల్స్‌ను కట్టిపడేశాడు. ఆఖర్లో తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్‌), ఆర్చర్‌ (10 బంతుల్లో 16 నాటౌట్‌) కొన్ని విలువైన పరుగులు చేశారు.

విరాట్‌ @ 5500

ఐపీఎల్‌లో 5,500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన కోహ్లీ మొత్తంగా 5,502 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతుండగా.. రైనా (5368), రోహిత్‌ (5068) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

స్కోరు బోర్డు

రాజస్థాన్‌: బట్లర్‌ (సి) పడిక్కల్‌ (బి) సైనీ 22, స్మిత్‌ (బి) ఉడాన 5, శాంసన్‌ (సి అండ్‌ బి) చాహల్‌ 4, ఊతప్ప (సి) ఉడాన (బి) చాహల్‌ 17, లోమ్రర్‌ (సి) పడిక్కల్‌ (బి) చాహల్‌ 47, పరాగ్‌ (సి) ఫించ్‌ (బి) ఉడాన 16, తెవాటియా (నాటౌట్‌) 24, ఆర్చర్‌ (నాటౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 154/6. వికెట్ల పతనం: 1-27, 2-31, 3-31, 4-70, 5-105, 6-114, బౌలింగ్‌: ఉడాన 4-0-41-2, సుందర్‌ 4-0-20-0, సైన 4-1-37-1, చాహల్‌ 4-0-24-3, జంపా 3-0-27-0, దూబే 1-0-4-0. 

బెంగళూరు: పడిక్కల్‌ (బి) ఆర్చర్‌ 63, ఫించ్‌ (ఎల్బీ) గోపాల్‌ 8, కోహ్లీ (నాటౌట్‌) 72, డివిలియర్స్‌ (నాటౌట్‌) 12, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 19.1 ఓవర్లలో 158/2. వికెట్ల పతనం: 1-25, 2-124, బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-18-1, ఉనాద్కట్‌ 3-0-31-0, గోపాల్‌ 4-0-27-1, కరన్‌ 3.1-0-40-0, తెవాటియా 4-0-28-0, పరాగ్‌ 1-0-13-0.