గురువారం 21 జనవరి 2021
Sports - Dec 16, 2020 , 16:17:20

గ్రెగ్ చాపెల్‌కు దిమ్మ‌దిరిగే స‌మాధాన‌మిచ్చిన కోహ్లి

గ్రెగ్ చాపెల్‌కు దిమ్మ‌దిరిగే స‌మాధాన‌మిచ్చిన కోహ్లి

అడిలైడ్‌: సాధార‌ణంగానే ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు కాస్త నోటి దురుసు ఎక్కువ‌. గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌త్యర్థి ప్లేయ‌ర్స్‌ను మాట‌ల‌తో బెద‌ర‌గొట్ట‌డం వారికి అల‌వాటు. అస‌లు దూకుడైన క్రికెట్‌కు తామే కేరాఫ్ అన్న‌ట్లుగా వాళ్లు వ్య‌వ‌హ‌రిస్తారు. టీమిండియా మాజీ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ప్లేయ‌ర్ గ్రెగ్ చాపెల్‌కు ఈ నోటి దురుసు మ‌రికాస్త ఎక్కువ‌. అందుకే ఈ మ‌ధ్య టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్ర‌శంసిస్తూనే.. అత‌ని మైండ్‌సెట్ ఓ ఆస్ట్రేలియ‌న్‌లాగా ఉంద‌న్నాడు. ద మోస్ట్ ఆస్ట్రేలియ‌న్ నాన్-ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ ఆఫ్ ఆల్ టైమ్ అని కోహ్లి గురించి చాపెల్ వ్యాఖ్యానించాడు. గ్రౌండ్‌లో కోహ్లి దూకుడైన ఆట‌తీరు, పోరాట ప‌టిమ చూస్తుంటే.. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మైండ్‌సెట్‌లాగే ఉంద‌ని అన్నాడు. 

దీనిపై కోహ్లి కూడా ఘాటుగానే స్పందించాడు. స‌రికొత్త ఇండియాకు త‌ను ప్ర‌తినిధిని అని, తానెప్పుడూ త‌నలాగే ఉన్నాన‌ని విరాట్ అన్నాడు. తొలి టెస్ట్‌కు ముందు జ‌రిగిన వ‌ర్చువ‌ల్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు విరాట్ ఇలా స్పందించాడు. నా వ్య‌క్తిత్వం, ప‌ర్స‌నాలిటీ ఓ స‌రికొత్త ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని నేను భావిస్తాను అని కోహ్లి చెప్పాడు. ఓ ఆస్ట్రేలియ‌న్ మైండ్‌సెట్‌తో పోల్చాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌న వ్య‌క్తిత్వం తొలి రోజు నుంచీ ఇలాగే ఉంద‌ని అన్నాడు. ఎలాంటి స‌వాళ్ల‌కైనా ఎదురు నిలిచే స‌త్తా ఈ స‌రికొత్త ఇండియాకు ఉన్న‌ద‌ని కూడా కోహ్లి చెప్పాడు. ఆశావాదం, సానుకూల భావ‌న‌ల‌తో నిండిన ఈ స‌రికొత్త ఇండియా ఎలాంటి స‌వాళ్ల‌నైనా స్వీక‌రించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.


logo