శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 07, 2020 , 19:41:21

కోహ్లీ స్లెడ్జ్‌ చేశాడు..అతడు సిక్స్‌ కొట్టాడు: వీడియో వైరల్‌

కోహ్లీ స్లెడ్జ్‌ చేశాడు..అతడు సిక్స్‌ కొట్టాడు: వీడియో వైరల్‌

అబుదాబి: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ఒక్కోసారి స్లెడ్జింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించేందుకు, ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు కూడా  వెనుకాడడు. టీమ్‌ఇండియా తరఫునైనా.. ఐపీఎల్‌లోనైనా కొన్నిసార్లు ఇదే పంథా సాగిస్తుంటాడు. అయితే శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన ఐపీఎల్‌ ఎలిమినేటర్‌లోనూ విరాట్‌ ఈ ట్రిక్‌ను ఉపయోగించాడు. అయితే అది కాస్త బెడిసి కొట్టింది. అతడు స్లెడ్జ్‌ చేశాక తర్వాతి బంతినే ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాట్స్‌మెన్‌ మనీశ్‌ పాండే తర్వాతి బంతిని సిక్సర్‌ బాదాడు. దీంతో సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

132 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. ఆర్‌సీబీ బౌలర్‌ సిరాజ్‌ బౌలింగ్‌ చేయగా.. రెండో బంతిని డిఫెన్స్‌ ఆడాడు. ఆ సమయంలో కోహ్లీ ఆజ్‌ నహీ మారేగా షాట్‌(ఈ రోజు అతడు షాట్‌ ఆడడు) అంటూ మనీశ్‌ వైపు చూసి, తప్పుడు షాట్‌ ఆడేలా కవ్వించాలని ప్రయత్నించాడు. అయితే తర్వాతి బంతికే చక్కటి పుల్‌షాట్‌తో మిడ్‌వికెట్‌ మీదుగా పాండే చక్కటి సిక్స్‌ కొట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

కాగా ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో  హైదరాబాద్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్‌ ఆదివారం తలపడనుంది.