అప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను: విరాట్ కోహ్లి

ముంబై: క్రికెట్ కెరీర్లో తాను బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సందర్భాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి షేర్ చేసుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మార్క్ నికోలస్‌తో చేసిన నాట్ జస్ట్ క్రికెట్ అనే పాడ్‌కాస్ట్‌లో కోహ్లి భారంగా గడిచిన ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. 2014 ఇంగ్లండ్ టూర్లో దారుణంగా విఫలమైన తర్వాత తాను డిప్రెషన్లోకి వెళ్లినట్లు కోహ్లి చెప్పాడు. పరుగులు సాధించడం లేదన్న బాధ నన్ను బాగా వేధించింది అని కోహ్లి అన్నాడు. ఆ టూర్లో పది ఇన్నింగ్స్‌లో కోహ్లి 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 స్కోర్లు చేశాడు.
ఒంటరిని అనిపించింది
ఆ సమయంలో ప్రపంచంలో తనలాంటి ఒంటరి వ్యక్తి మరొకరు లేరని తనకు అనిపించినట్లు కోహ్లి చెప్పాడు. ఆ సమయంలో నేను ఏమీ చేయలేకపోయాను. చుట్టూ ఎంతో మంది ఉన్నాఒంటరిగా అనిపించింది. నా ఫీలింగ్స్ పంచుకోవడానికి నా చుట్టూ ఎంతో మంది ఉన్నా.. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో అర్థం చేసుకునే ఓ ప్రొఫెషనల్ కావాలని అనిపించింది అని కోహ్లి చెప్పాడు. మానసిక సమస్యలను ఎవరైనా సరే తేలిగ్గా తీసుకోవద్దని ఈ సందర్భంగా కోహ్లి సూచించాడు.