శుక్రవారం 03 జూలై 2020
Sports - May 30, 2020 , 14:27:20

‘ఫోర్బ్స్‌' జాబితాలో భారత్‌ నుంచి కోహ్లీ ఒక్కడే

‘ఫోర్బ్స్‌' జాబితాలో భారత్‌ నుంచి కోహ్లీ ఒక్కడే

హైదరాబాద్‌: ఆటలోనే కాదు ఆదాయంలోనే తనకు ఎదురులేదని నిరూపించాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహీ. ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న వందమంది అథ్లెట్లతో ప్రముఖ మ్యాగజీన్‌ ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితాలో భారత్‌ నుంచి కోహ్లీ ఒక్కడే స్థానం సంపాదించాడు. రూ.196 కోట్ల ఆదాయంతో జాబితాలో 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే కోహ్లీ 34 స్థానాలు ఎగబాకాడు. 2019లో కోహ్లీ 100వ స్థానంలో ఉన్నాడు. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు రూపంలో 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకు విరాట్‌ కోహ్లీకి రూ.7 కోట్లు అందనున్నాయి. ఇవేకాకుండా ప్రైజ్‌మనీ రూపంలో మరో రూ.7 కోట్లు ఆర్జించే అవకాశం ఉంది. ప్రముఖ కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్న ఆయన సుమారు రూ.180 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.  

స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన కెరీర్‌లోనే తొలిసారిగా రూ.801 కోట్లతో ఫోర్బ్స్‌ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఓ టెన్నిస్‌ ఆటగాడు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. తర్వాతి మూడు స్థానాల్లో ఫుట్‌బాల్‌ ప్లేయర్లే ఉండటం గమనార్హం. రూ.794 కోట్ల ఆదాయంతో పోర్చ్‌గల్‌కు చెందిన రొనాల్డో, రూ.789 కోట్లతో అర్జెంటీనాకు చెందిన లియోనల్‌ మెస్సీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్ల జాబితాలో జపాన్‌కు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి నవామి ఒసాకా మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.


logo