ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 22, 2020 , 15:28:55

నేను వెళ్తున్నా..మీ సత్తా చాటండి:కోహ్లీ

నేను వెళ్తున్నా..మీ సత్తా చాటండి:కోహ్లీ

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మంగళవారం ఉదయం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు  బయలుదేరాడు. మిగతా మూడు టెస్టులకు  జట్టు సారథ్య బాధ్యతలను ఆజింక్య రహానెకు  అప్పగించాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో  విరాట్‌ పెటర్నిటీ లీవ్‌ తీసుకున్నాడు.  తాను వెళ్లిపోతున్నానని, మీ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు కోహ్లీ 

నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో  జట్టు సభ్యులతో కోహ్లీ సమావేశమయ్యాడు. ఆటగాళ్ల మనోధైర్యాన్ని పెంచేందుకు వారితో పలు అంశాలపై  చర్చించాడని, ఆ తర్వాత భారత్‌కు పయనమైనట్లు ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. 

'ఇవాళ ఉదయం కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరాడు. అతడు వెళ్లేముందు జట్టు బృందంతో భేటీ అయ్యాడు.  ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతూ సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను అధికారికంగా  రహానెకు  అప్పగించాడు. మైదానంలో మీ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించాలని సూచించాడు. రెండో టెస్టు తర్వాత రోహిత్‌ శర్మ అందుబాటులోకి రానుండగా..యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేయడంలో  రహానె పాత్ర ఇప్పుడు కీలకంగా మారిందని' విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


logo