గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 22, 2020 , 00:06:36

పేస్‌కు పడ్డారు

పేస్‌కు పడ్డారు

జేమిసన్‌ వీరవిహారం.. కోహ్లీ, పుజార, విహారి విఫలం .. ఆదుకున్న రహానే.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 122/5 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్‌కు న్యూజిలాండ్‌లో పేస్‌ పరీక్ష ఎదురైంది. సవాలు విసిరే వాతావరణ పరిస్థితులకు పిచ్‌పై బుల్లెట్‌లా దూసుకొచ్చే బంతులకు ఎదురొడ్డి నిలువడంలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. పచ్చని పిచ్‌పై కివీస్‌ పేసర్లు పండుగ చేసుకున్నారు. ఆరున్నర అడుగుల యువ పేసర్‌ కైల్‌ జేమిసన్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరహో అనిపించాడు. చురకత్తుల్లాంటి బంతులతో భారత్‌ బ్యాటింగ్‌ నడ్డివిరిచాడు. పదునైన స్వింగ్‌తో కెప్టెన్‌ కోహ్లీ, పుజార, విహారిని పెవిలియన్‌ పంపాడు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును రహానే ఆపద్భాంవుడిలా ఆదుకున్నాడు. కివీస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వరుణుడు అంతరాయం కల్గించిన మ్యాచ్‌లో పూర్తి ఓవర్ల కోటా కాకముందే మొదటి రోజు ముగిసింది.

వెల్లింగ్టన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అప్రతిహత విజయాలతో ఎదురన్నది లేకుండా దూసుకెళుతున్న భారత్‌కు అనుకున్నట్లే న్యూజిలాండ్‌ పిచ్‌లు అగ్ని పరీక్ష పెడుతున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ పరుగుల వేటలో విఫలమయ్యారు. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌.. వాతావారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ కైల్‌ జేమిసన్‌ (3/38) విజృంభణకు తోడు సౌథీ (1/27), బౌల్ట్‌(1/44) రాణింపుతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. రహానే(122 బంతుల్లో 38 నాటౌట్‌, 4ఫోర్లు) బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌ ఆడగా, మయాంక్‌ (34) ఆకట్టుకున్నాడు. రహానేకు తోడు పంత్‌(10) క్రీజులో ఉన్నాడు. 


షా ఫ్లాప్‌, అగర్వాల్‌ హిట్‌

 రోహిత్‌శర్మ గైర్హాజరీలో జట్టులోకి తిరిగి వచ్చిన పృథ్వీషా(16) ఆకట్టుకోలేకపోయాడు. కివీస్‌ పదునైన పేస్‌ దాడికి ఎదుర్కొవడంలో విఫలమైన షా..స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. రెండు బౌండరీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా..సౌథీ బౌలింగ్‌లో బంతిని  అంచనా వేయలేకపోయిన షా మూల్యం చెల్లించుకున్నాడు. ప్యాడ్లను ముద్డాడుతూ వెళ్లిన బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేడయంతో 16 పరుగులకే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మరో ఎండ్‌లో మయాంక్‌  స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా(11)తో కలిసి అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ఆఫ్‌స్టంప్‌ అవతలి బంతులను వదిలిపెట్టిన పుజారను బౌలింగ్‌ మార్పుగా వచ్చిన జేమిసన్‌ ఔట్‌ చేశాడు. స్వింగ్‌ డెలివరీని ఆడబోయిన పుజార.. వాట్లింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.సహచరులు నిష్క్రమిస్తున్నా.. మయాంక్‌ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. 


కోహ్లీ మళ్లీ! 

కెప్టెన్‌ కోహ్లీ ఫామ్‌లేమి కొనసాగుతున్నది. పుజారా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ(2) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యాడు. జేమిసన్‌ బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 


ఆదుకున్న రహానే: 

మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును అగర్వాల్‌తో కలిసి రహానే ఆదుకున్నాడు. ముఖ్యంగా రహానే తన అనుభవాన్ని రంగరిస్తూ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో బౌల్ట్‌ బౌలింగ్‌లో అగర్వాల్‌ ఔటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఆదుకుంటాడునుకున్న తెలుగు క్రికెటర్‌ విహారి(7) కూడా నిరాశపరిచాడు. జేమిసన్‌కు వికెట్‌ ఇచ్చుకోవడంతో భారత్‌ కష్టాలు మరింత పెరిగాయి. ఓవైపు వికెట్లు పడుతున్నా.. రహానే.. కివీస్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. పంత్‌ను అండగా చేసుకుంటూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అయితే టీ విరామం తర్వాత ఎడతెరిపిలేని వర్షంతో మ్యాచ్‌ 55 ఓవర్లకే పరిమితమైంది. మొత్తంగా తొలి రోజు ఆటలో కివీస్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.  


స్కోరుబోర్డు: భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీషా(బి) సౌథీ 16, మయాంక్‌(సి)జేమిసన్‌(బి) బౌల్ట్‌ 34, పుజారా(సి)వాట్లింగ్‌(బి)జేమిసన్‌ 11, కోహ్లీ(సి)టేలర్‌(బి)జేమిసన్‌ 2, రహానే 38 నాటౌట్‌, విహారి(సి)వాట్లింగ్‌(బి)జేమిసన్‌ 7, పంత్‌ 10 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 55 ఓవర్లలో 122/5; వికెట్ల పతనం: 1-16, 2-35, 3-40, 4-88, 5-101; బౌలింగ్‌: సౌథీ 14-4-27-1, బౌల్ట్‌ 14-2-44-1, గ్రాండ్‌హోమ్‌ 11-5-12-0, జేమిసన్‌ 14-2-38-3, పటేల్‌ 2-2-0-0.


logo
>>>>>>