సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 16, 2020 , 14:44:26

విరాట్‌ అభిమాని హెయిర్‌కట్‌ చూశారా..!

విరాట్‌ అభిమాని హెయిర్‌కట్‌ చూశారా..!

ముంబయి: మంగళవారం వాంఖెడే స్టేడియంలో తొలివన్డేలో భారత్‌, ఆస్ట్రేలియా తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ, స్టేడియంలో ఓ అభిమాని హెయిర్‌ైస్టెల్‌కు మాత్రం అందరూ ఫిదా అయ్యారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులన్న విషయం తెలిసిందే. వారి అభిమనాన్ని చాటుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తారు. ఆయన పేరును, చిత్రాన్ని వారి శరీరంపై టాటూ వేసుకున్న వారికి లెక్కే లేదు. కానీ, ఓ అభిమాని మాత్రం వినూత్నంగా తన తల వెనుకభాగంలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముఖ చిత్రాన్ని అచ్చుగుద్దినట్లు తీర్చిదిద్దుకొని వచ్చాడు. అతడే విరాట్‌ అభిమాని చిరాగ్‌ ఖిలారే. చిరాగ్‌ ఈ చిత్రాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ది బెస్ట్‌ ఐయామ్‌ కోహ్లి ఫ్రమ్‌ హార్ట్‌ టు హెడ్‌, విరాటియన్‌ చిరాగ్‌ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

తన హెయిర్‌ కట్‌పై చిరాగ్‌ను ఓ మీడియా సంస్థ పలకరించగా.. నేను చాలా ఏళ్లుగా విరాట్‌ను ఫాలో అవుతున్నాను. అతడు ఆడిన ప్రతి మ్యాచ్‌ని నేను చూస్తాను. విరాట్‌ అండర్‌-19 టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తున్నప్పటి నుంచే అతడికి నేను అభిమానినయ్యానని చిరాగ్‌ తెలిపాడు. కాగా, తన తలపై విరాట్‌ ముఖ చిత్రాన్ని రూపొందించడానికి హెయిర్‌ ైస్టెలిస్ట్‌ 6-8 గంటల సమయం తీసుకున్నాడు. తనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చిరాగ్‌ అన్నాడు.

విరాట్‌ను కలవాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. కానీ, అతడిని కలుసుకునే అవకాశం రావడం లేదని కొంత ఆవేదనగా చెప్పాడు చిరాగ్‌. విరాట్‌ను కలవడం నా కల. ఎప్పుడైతే అతడిని కలుస్తానో.. ముందు అతడి పాదాలను తాకి, గట్టిగా హగ్‌ చేసుకుంటానని, అదే సమయంలో ఓ ఫోటో తీయించుకుంటానని అతడు అన్నాడు.


logo