మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 29, 2020 , 11:27:28

సిరీస్‌పె గురి

సిరీస్‌పె గురి

నేడు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మూడో టీ20 సిరీస్‌పై కన్నేసిన కోహ్లీసేన.. తీవ్ర ఒత్తిడిలో కివీస్‌ పొట్టి ప్రపంచకప్‌ జరుగనున్న ఏడాదిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా మరో సిరీస్‌పై కన్నేసింది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ నుంచి టీ20 ఫార్మాట్‌లో సిరీస్‌ కోల్పోని కోహ్లీ అండ్‌ కో.. న్యూజిలాండ్‌ గడ్డపై తొలి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. బ్యాటింగ్‌లో లోకేశ్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ విజృంభిస్తుంటే.. బౌలింగ్‌లో బుమ్రా, జడేజా జోరు మీదున్నారు. నాయక ద్వయం కోహ్లీ, రోహిత్‌ కూడా తమ బ్యాట్‌లకు పనిచెబితే భారత్‌ను అడ్డుకోవడం కివీస్‌కు కష్టసాధ్యమే. ఈడెన్‌లో టీమ్‌ఇండియాను అడ్డుకోలేకపోయిన బ్లాక్‌క్యాప్స్‌ సెడాన్‌లో ఏమేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

హామిల్టన్‌: కొరుకుడుపడని కివీస్‌ టూర్‌లో తొలి టీ20 సిరీస్‌ చేజిక్కించుకునేందుకు టీమ్‌ఇండియా ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఇప్పటి వరకు రెండుసార్లు కివీస్‌ పర్యటనలో పొట్టి సిరీస్‌లు కోల్పోయిన భారత్‌.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడేందుకు సమాయత్తమవుతున్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టీ20లు నెగ్గి 2-0తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన.. బుధవారం ఇక్కడి సెడాన్‌ పార్క్‌లో న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌ ఆడనుంది. టీమ్‌ఇండియా వరుస విజయాలు సాధిస్తూ జోరు కనబరుస్తుంటే.. కివీస్‌ మాత్రం పరాజయాల బాట వీడలేక ఇబ్బంది పడుతున్నది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన కివీస్‌ ఇప్పుడు భారత్‌ చేతిలో టీ20 సిరీస్‌ ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. సిరీస్‌ నెగ్గేందుకు కోహ్లీ అండ్‌ కో వద్ద మరో రెండు అవకాశాలు ఉండగా.. న్యూజిలాండ్‌ మాత్రం ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌ నెగ్గితేనే సిరీస్‌ సాధించగలుగుతుంది. ఇలాంటి ఒత్తిడిలో సమిష్టిగా సత్తాచాటేందుకు విలియమ్సన్‌ బృందం సిద్ధమవుతుంటే.. ఈడెన్‌ పార్క్‌ను మన డెన్‌గా మార్చుకున్న కోహ్లీ సేన.. సెడాన్‌ పార్క్‌లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేయాలని చూస్తున్నది. 


రోహిత్‌ కూడా రాణిస్తే..

తొలి రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో విజృంభించిన టీమ్‌ఇండియా మరోసారి అదే దూకుడు కనబరిచి ఇక్కడే సిరీస్‌ ఒడిసి పట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ముందే సిరీస్‌ ఫలితం తేలిపోతే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించుకోవచ్చని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది. పనిలో పనిగా కివీస్‌ గడ్డపై తమ రికార్డు మెరుగుపర్చుకోవాలని కూడా ఆశిస్తున్నది. బ్యాటింగ్‌లో భారత్‌కు పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయిన హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ ఝలిపిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో స్థానంతో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న లోకేశ్‌ రాహుల్‌ అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే.. కెప్టెన్‌ కోహ్లీ మంచి టచ్‌లో ఉన్నాడు. నాలుగో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్‌మన్‌ కోసం నిరీక్షిస్తున్న భారత్‌కు అయ్యర్‌ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.  శివం దూబే, మనీశ్‌ పాండే కూడా విజృంభిస్తే భారీ స్కోరు ఖాయమే. 


ఇరు జట్ల మధ్య తేడా అదే..

బ్యాటింగ్‌లో రెండు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నా.. ప్రధాన తేడా మాత్రం బౌలింగ్‌ అనే చెప్పాలి. ముఖ్యంగా భారత ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కొనేందుకు కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తొలి మ్యాచ్‌ స్లాగ్‌ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసి మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్న ఈ యార్కర్‌ కింగ్‌.. మలి మ్యాచ్‌లో పరుగులు ఇవ్వడంలో తన పిసినారితనాన్ని చాటుకున్నాడు. బుమ్రా స్ఫూర్తిగా షమీ, జడేజా కూడా చెలరేగిపోవడంతో రెండో టీ20లో కివీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. హామిల్టన్‌ మైదానం పెద్దది కావడంతో చాహల్‌ను కాదని కుల్దీప్‌ యాదవ్‌కు చాన్స్‌ ఇస్తారా చూడాలి. అయితే విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చడానికి ఇష్టపడని విరాట్‌ తుదిజట్టులో మార్పులు చేస్తాడా అనేది అనుమానమే. సైనీ, పంత్‌ బెంచ్‌కే పరిమితం కాక తప్పకపోవచ్చు. 

 4 ఈ వేదికపై జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి.

బుమ్రాను అడ్డుకుంటేనే.. 

బౌలింగ్‌లో కివీస్‌కు పెద్ద గా ఇబ్బందులు లేకు న్నా.. బ్యాటింగ్‌లోనే ఇం కా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. తొలి పోరులో భారత్‌ అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఓటమి పాలైన బ్లాక్‌క్యాప్స్‌ రెండో మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయారు. అయితే హామిల్టన్‌ పిచ్‌పై చక్కటి రికార్డు ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. గతంలో ఇక్కడ 9 మ్యాచ్‌లు ఆడిన కివీస్‌ ఏడింట విజయం సాధించింది. ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలింగ్‌ చేయని అతడు బ్యాట్‌తో 0, 3 పరుగులు చేశాడు. అయితే స్పిన్‌ ఎదుర్కోవడంలో అనుభవమున్న అతడికి మరో చాన్స్‌ ఇస్తారా లేక టామ్‌ బ్రూస్‌ను తుదిజట్టులోకి తీసుకుంటారా చూడాలి.


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, అయ్యర్‌, పాండే, దూబే, జడేజా, శార్దూల్‌, చాహల్‌, షమీ, బుమ్రా.

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్‌, మున్రో, గ్రాండ్‌హోమ్‌, టేలర్‌, సైఫెర్ట్‌, శాంట్నర్‌/డారిల్‌ మిషెల్‌, సోధి, సౌథీ, టిక్నర్‌/కుగ్‌లీన్‌, బెనెట్‌.

పిచ్‌, వాతావరణం సెడాన్‌ పార్క్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. గతేడాది ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు (212/4) చేయగా.. టీమ్‌ఇండియా నాలుగు పరుగుల తేడాతో ఓడింది. వికెట్‌పై పచ్చిక ఉన్నా పరుగుల వరద ఖాయమే. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు లేవు.


logo
>>>>>>