గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 00:35:57

0-2

0-2

అద్భుతాలు జరుగలేదు. ఆశ్చర్యకర ఫలితం రాలేదు.అంతా ఊహించినట్లుగానే మనవాళ్లు వైఫల్యాల బాట కొనసాగించారు. మూడోరోజు లోయర్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పట్టుమని పది ఓవర్లు ఆడకముందే ఆలౌటయ్యారు. ఫలితంగా ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యం నిలువగా.. న్యూజిలాండ్‌ ఓపెనర్లు విజృంభించి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంతో రెండో టెస్టులో కివీస్‌ అలవోకగా గెలుపొందింది. మూడో రోజుల్లోనే భారత్‌ను మడతెట్టేసిన బ్లాక్‌క్యాప్స్‌.. ప్రపంచ నంబర్‌వన్‌ టెస్టు టీమ్‌కు ఎనిమిదేండ్ల తర్వాత వైట్‌వాష్‌ రుచి చూపించారు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియాకు ఇదే తొలి వైట్‌వాష్‌ కాగా.. టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎదురులేకుండా సాగుతున్న కోహ్లీసేనను.. న్యూజిలాండ్‌ నేలకు దించింది.

  • కివీస్‌ చేతిలో భారత్‌ వైట్‌వాష్‌.. రెండో టెస్టులో భారీ ఓటమి

క్రైస్ట్‌చర్చ్‌: తొలి టెస్టుతో పోల్చుకుంటే.. కాస్త మెరుగైన ప్రదర్శన చేసినా.. బ్యాట్స్‌మెన్‌ బాధ్యతారాహిత్యంతో టీమ్‌ఇండియా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాపార్డర్‌ విఫలమైన చోట.. మిడిల్‌ మ్యాజిక్‌ చేస్తుందనుకుంటే.. అలాంటి అద్భుతాలేమీ జరుగలేదు. ఓవరాల్‌గా ఈ పర్యటనలో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ఆ తర్వాత జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురికావడం గమనార్హం. ఓవర్‌నైట్‌ స్కోరు 90/6తో సోమవారం మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. మరో పది ఓవర్లు ఆడి 34 రన్స్‌ జతచేసి 124 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌల్ట్‌కు 4, సౌథీకి మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ చేజ్‌ చేసింది.


 ఓపెనర్లు లాథమ్‌ (52; 10 ఫోర్లు), బ్లండెల్‌ (55; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. జెమీసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', సౌథీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'అవార్డులు దక్కాయి. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో 120 పాయిం ట్లు ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్‌ (180) మూడో స్థానానికి చేరగా.. టీమ్‌ఇండియా (360) అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

న్యూజిలాండ్‌ పేసర్లు చక్కటి ప్రదర్శన కనబరిచారు. తొలి టెస్టులో మా ఆట స్థాయికి తగ్గట్లు లేకపోయింది. ఇక్కడ బాగా ఆడినా మా పొరపాట్ల వల్లే ఓడిపోయాం. మా బౌలర్లు మాత్రం ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌ వైఫల్యంతో బౌలర్ల శ్రమ వృథా అయింది. ఈ పరాజయానికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయడం సరికాదు. 

 కోహ్లీ, భారత కెప్టెన్‌


కోహ్లీకి కోపమొచ్చింది

తన కెప్టెన్సీలో తొలి వైట్‌వాష్‌ ఎదుర్కొన్న  కోహ్లీ.. మ్యాచ్‌ అనంతరం పరుష వ్యాఖ్యలతో మరింత అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఓటమి అనంతరం మీడియా సమావేశానికి హాజరైన కోహ్లీ.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరైన బదులివ్వకుండా అతడిపై విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాట్స్‌మెన్‌ ఔటైన సమయంలో కోహ్లీ నోటిపై వేలు పెట్టుకుంటూ అసభ్య పదజాలంతో దూషించిన వీడియో వైరల్‌ అవడంపై విలేఖరి ప్రశ్నించగా.. ‘మీరేమనుకుంటున్నారు. ఆ ప్రశ్నకు జవాబు మిమ్మల్నే అడుగుతున్నా.. అక్కడేం జరిగిందో మీకు తెలుసా? అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడగకూడదు. ఈ అంశంపై రిఫరీతో మాట్లాడా. వారెలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు’అని కోహ్లీ బదులిచ్చాడు. 


‘దిఖాదూంగా’

రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఫీల్డ్‌లో ఉన్న కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వీళ్లు మనదేశానికి వచ్చినప్పుడు చూపిస్తా’(జబ్‌ భారత్‌మే ఏ లోగ్‌ ఆయేంగే.. తబ్‌ దిఖాదూంగా) అని కోహ్లీ అన్న మాటలు వికెట్‌ మైక్‌లో రికార్డయ్యాయి.


1కోహ్లీ కెప్టెన్సీలో భారత్‌ టెస్టు సిరీస్‌ వైట్‌వాష్‌కు గురికావడం ఇదే తొలిసారి.

3విరాట్‌ సారథ్యంలో టీమ్‌ఇండియాకు ఇది మూడో టెస్టు సిరీస్‌ పరాజయం. ఇంతకుముందు దక్షిణాఫ్రికా , ఇంగ్లండ్‌  చేతిలో ఓడింది.


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 242, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 242, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) సౌథీ 14, మయాంక్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 3, పుజారా (బి) బౌల్ట్‌ 24, కోహ్లీ (ఎల్బీ) గ్రాండ్‌హోమ్‌ 14, రహానే (బి) వాగ్నర్‌ 9, ఉమేశ్‌ (బి) బౌల్ట్‌ 1, విహారి (సి) వాట్లింగ్‌ (బి) సౌథీ 9, పంత్‌ (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 4, జడేజా (నాటౌట్‌) 16, షమీ (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 5, బుమ్రా (రనౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 21, మొత్తం: 124 ఆలౌట్‌. వికెట్లపతనం: 1-8, 2-26, 3-51, 4-72, 5-84, 6-89, 7-97, 8-97, 9-108, 10-124, బౌలింగ్‌: సౌథీ 11-2-36-3, బౌల్ట్‌ 14-4-28-4, జెమీసన్‌ 8-4-18-0, గ్రాండ్‌హోమ్‌ 5-3-3-1, వాగ్నర్‌ 8-1-18-1.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 52, బ్లండెల్‌ (బి) బుమ్రా 55, విలియమ్సన్‌ (సి) రహానే (బి) బుమ్రా 5, టేలర్‌ (నాటౌట్‌) 5, నికోల్స్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 132/3. వికెట్ల పతనం: 1-103, 2-112, 3-121, బౌలింగ్‌: బుమ్రా 13-2-39-2, ఉమేశ్‌ 14-3-45-1, షమీ 3-1-11-0, జడేజా 5-0-24-0, కోహ్లీ 1-0-4-0.


logo