శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 17:51:34

ఐపీఎల్‌ నుంచి విజయ్‌ శంకర్‌ ఔట్‌!

ఐపీఎల్‌ నుంచి విజయ్‌ శంకర్‌ ఔట్‌!

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్లేఆఫ్‌ రేసులో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా  ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ టోర్నీ నుంచి వైదొలిగినట్లు తెలిసింది.   గత కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్‌, బంతితో రాణిస్తున్న  శంకర్ ఢిల్లీ  క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో   గాయపడ్డాడు. బౌలింగ్‌ చేసే సమయంలో కండరాలు పట్టేయడంతో తన రెండో ఓవర్‌లో ఐదు బంతులు వేసిన విజయ్‌ నొప్పితో మైదానాన్ని వీడాడు. శనివారం జరిగే రాత్రి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ తలపడనుంది. 

గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్‌ అదే జోరులో బెంగళూరుపై కూడా నెగ్గి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని యోచిస్తున్నది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌.. ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలువగా.. చెన్నై  మాత్రమే అధికారికంగా రేసు నుంచి తప్పుకుంది. మరొక్క విజయం సాధిస్తే.. బెంగళూరు కూడా బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఈ స్థితిలో కోహ్లీ సేన విజయంపై కన్నేసింది. హైదరాబాద్‌కు కూడా ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలున్నా.. ఉన్న రెండు మ్యాచ్‌లు తప్పక నెగ్గడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా వార్నర్‌ సేనకు అనుకూలంగా రావాల్సి ఉంది. లీగ్‌దశలో మెరుగైన రన్‌రేట్‌ ఉండటం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం.