బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 05, 2020 , 00:41:53

వారెవ్వా వెలాసిటీ

వారెవ్వా వెలాసిటీ

  • సూపర్‌ నోవాస్‌పై అద్భుత విజయం 
  • రాణించిన సునె లస్‌, సుష్మ 

అమ్మాయిలు అదరగొట్టారు. కరోనా వైరస్‌  విజృంభణ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత   బరిలోకి దిగినా.. అదిరిపోయే ఆటతీరుతో  ఆకట్టుకున్నారు. సూపర్‌ నోవాస్‌తో ఆఖరి వరకు హోరాహోరీగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో మిథాలీసేన     విజయదుందుభి మోగించింది. 

షార్జా: టీ20 చాలెంజ్‌(మహిళల ఐపీఎల్‌)లో మిథాలీ రాజ్‌ నేతృత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది. బుధవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. నోవాస్‌ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యఛేదనలో వెలాసిటీ 19.5 ఓవర్లలో 129 పరుగులు చేసింది. సునె లీస్‌(21 బంతుల్లో 37 నాటౌట్‌, 4ఫోర్లు, సిక్స్‌), సుష్మా వర్మ (33 బంతుల్లో 34, 2 సిక్స్‌లు) రాణించారు. కాకా (2/27) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. అంతకు ముందు ఏక్తాబిస్త్‌ (3/22), కాస్ప్రెక్‌ (2/23), ఆలమ్‌ (2/27) విజృంభణతో నోవాస్‌ 20 ఓవర్లలో 126/8 స్కోరు చేసింది. చమరీ ఆటపట్టు (44), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(31) ఆకట్టుకున్నారు. లీస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లభించింది. 

రాణించిన లీస్‌, సుష్మ: 

లక్ష్యఛేదనలో వెలాసిటీకి శుభారంభం దక్కలేదు. వ్యాట్‌(0), షెఫాలీ వర్మ(17), కెప్టెన్‌ మిథాలీరాజ్‌(7) వైఫల్యంతో వెలాసిటీ 38 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన సమయంలో మిడిలార్డర్‌ కీలక భూమిక పోషించింది. నోవాస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయింది.  సునె లీస్‌, సుష్మతో పాటు వేద బ్యాటు ఝులిపించడంతో వెలాసిటీ విజయాన్నందుకుంది. ముఖ్యంగా లీస్‌, సుష్మ సూపర్‌ షాట్లతో అలరించారు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా బౌండరీలతో చెలరేగారు. గెలుపు దరిచేరుతున్న సమయం లో వికెట్లు పడ్డా.. లీస్‌, శిఖా పాండే జట్టును విజయ తీరాలకు చేర్చారు. 

ఏక్తా స్పిన్‌ మ్యాజిక్‌: 

కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ వెలాసిటీ బౌలర్లు..సూపర్‌ నోవాస్‌ బ్యాట్స్‌వుమన్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. పునియా(11)ను ఔట్‌ చేసిన కాస్ప్రెక్‌.. వికెట్ల ఖాతా తెరిచింది. పవర్‌ప్లే ముగిసే సరికి నోవాస్‌ వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. దూకుడు కనబరిచిన  రోడ్రిగ్స్‌(7) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది. భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఏక్తా ఊరించే బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన రోడ్రిగ్స్‌ మూల్యం చెల్లించుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా..ఆటపట్టు నిలకడ ప్రదర్శించింది. క్రీజులోకొచ్చిన కెప్టెన్‌ కౌర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.  భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన ఆటపట్టు..లాంగ్‌ఆన్‌లో వేద చేతికి చిక్కింది. బౌలర్లు ఒత్తిడి పెంచడంతో నోవాస్‌ 14 పరుగుల తేడాతో ఆఖరి నాలుగు వికెట్లు కోల్పోయి 126 పరుగులకు పరిమితమైంది. 

సంక్షిప్త స్కోర్లు

 సూపర్‌ నోవాస్‌: 20 ఓవర్లలో 126/8(చమరీ ఆటపట్టు 44, హర్మన్‌ప్రీత్‌ 31, ఏక్తా 3/22, కాస్ప్రెక్‌ 2/23)

వెలాసిటీ: 19.5 ఓవర్లలో 129/5 (సునె లీస్‌ 37 నాటౌట్‌, సుష్మా వర్మ 34, కాక 2/27, రాధా యాదవ్‌ 1/25).