శనివారం 30 మే 2020
Sports - Mar 29, 2020 , 23:59:28

ఆసీస్‌తో సమరానికి సిద్ధమవుతున్నా..

ఆసీస్‌తో సమరానికి సిద్ధమవుతున్నా..

  • ఫిట్‌నెస్‌, నైపుణ్యం మెరుగుదలపై దృష్టిపెట్టా 
  • 2005 యాషెస్‌ వీడియోలు చూస్తున్నా
  • టీమ్‌ఇండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ హనుమ విహారి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌తో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నానని టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌, తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి చెప్పాడు. ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నానని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కౌంటీ క్రికెట్‌తో పాటు ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఫిట్‌నెస్‌, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంపై ఈ సమయంలో ఏకాగ్రత పెడుతున్నా. సానుకూలంగా, బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. నా వరకు మరో నాలుగు నెలల వరకు ఆట ఉండే అవకాశం లేదు. ఇంగ్లీష్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌ కోసం ఓ జట్టుతో ఒప్పందం చేసుకున్నా.. అది జరుగుతుందో లేదో’ అని విహారి చెప్పాడు. 

దోశలు ఎక్కువగా తింటున్నా..

ఇంటి ఆహారం అవడంతో ఎక్కువగా తింటున్నానని హనుమ విహారి చెప్పాడు. దీనికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తునానన్నాడు. ‘ఇంటి ఆహారం కావడంతో కాస్త గతితప్పి తింటున్నా. ఇందుకోసం కాస్త మోసం చేసుకుంటున్నా. సాధారణంగా తినే దానికన్నా దోశలు మరిన్ని ఎక్కువగా తింటున్నా. అయితే వ్యాయామం చేసేందుకు ఎక్కువ సయమం దొరకడంతో ఎక్స్‌ట్రా క్యాలరీలను కరిగించేస్తున్నా. ఈ విరామం వల్ల  మే 19న నా తొలి పెళ్లిరోజును భార్యతో కలిసి జరుపుకోబోతున్నా. లేకపోతే క్రికెట్‌లో బిజీగా ఉండేవాడిని’ అని విహారి చెప్పాడు. 

బోర్‌ కొట్టకుండా పరిష్కారముంది

కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధం తప్పనిసరి అని విహారి చెప్పాడు. దీంతో బయటకు వెళ్లడం, స్నేహితులను కలవడం కుదరకపోయినా.. బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తన వద్ద పరిష్కారముందన్నాడు. ‘2005 యాషెస్‌ వీడియో చూస్తున్నా. అదే నా ఫేవరెట్‌. ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. పరిస్థితులు చక్కబడే వరకు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సిన అవసరం ఉంది’ అని విహా రి చెప్పాడు. అలాగే యోగా చేయాలని కూడా ప్రణాళిక వేసుకున్నట్టు వెల్లడించాడు. 


logo