కొవిడ్ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ నిర్ణయం
బిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్
క్లిక్ చేస్తే ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో బిల్లు
ఆన్లైన్లోనే చెల్లించే అవకాశం
వరంగల్ సబర్బన్, మే 5 : ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంటి పరిసరాల్లోకి బయటి వ్యక్తి వస్తే అనుమానంగా చూస్తున్న పరిస్థితుల్లో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో ముఖ్యంగా ప్రతి నెలా విద్యుత్ మీటర్ల బిల్లులు నమోదు చేయడం కష్టంగా మారింది. ఇప్పటికే విద్యుత్ మీటర్ రీడింగ్ చూసే సిబ్బంది కొందరు కరోనా బారినపడ్డారు. అంతేగాక రీడింగ్ కోసం వచ్చే వారితోనూ ఇంటి పట్టున ఉంటున్న వినియోగదారులకు కరోనా అంటుకునే ప్రమాదం ఉంది. ఈక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు వినియోగదారులే రీడింగ్ తీసుకునే సదుపాయం కల్పించారు.
మీటర్ రీడింగ్ మీరే తీయవచ్చు
ఎన్పీడీసీఎల్ మొత్తం 17 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ పరిధిలో 61 లక్షల74 వేల 19 లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ మీటర్లు ఉండగా, మరో 3,211 హైటెన్షన్(హెచ్‌టీ) మీటర్లతో కలిపి మొత్తం 61లక్షల 77వేల 230 విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ఇందులో 15 లక్షల 2వేల 974 వ్యవసాయ, హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు మినహాయిస్తే మిగతా 60,51,467 మీటర్లకు ప్రతినెలా స్పాట్ బిల్లింగ్ సిబ్బంది వెళ్లి రీడింగ్ తీయాల్సి ఉంటుంది. నమోదు చేసిన తర్వాత వినియోగదారుడు సమీప కార్యాలయంలో క్యూలైన్లో నిల్చొని బిల్లు కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున ఎవరి బిల్లు వారే సులభంగా రీడింగ్ తీసుకొని ఆన్లైన్లో చెల్లించేలా సదుపాయం కల్పించింది. ఇందుకోసం ఎన్పీడీసీఎల్ పేరుతో ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది.
యాప్ ఎలా పని చేస్తుందంటే..
ప్లేస్టోర్ నుంచి టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి అందులో సెల్ఫ్ రీడింగ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్ సెల్ఫ్ రీడింగ్‌ను ఎంచుకుని యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన కన్ఫర్మ్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఎంటర్ చేసి కేడబ్ల్యూహెచ్పై క్లిక్ చేసి మీటర్ లోపల ఉండే కేడబ్ల్యూహెచ్ రీడింగ్‌ను స్కాన్ చేసే సమయంలో ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ నొక్కితే మీరు ఈ నెలలో వాడుకున్న బిల్లు మెస్సేజ్ రూపంలో వస్తుంది. ఈ విధానం ఈ నెల వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పరిశీలిస్తారు. సెల్ఫ్ రీడింగ్ తీసుకోకుంటే స్పాట్‌బిల్లింగ్ కార్మికులు కూడా వచ్చి రీడింగ్ తీస్తారు.