మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 01:57:23

సెరెనా జోరు

సెరెనా జోరు

  • మూడో రౌండ్‌లో స్టీఫెన్స్‌పై గెలుపు 
  • ప్రిక్వార్టర్స్‌లో కెనిన్‌, థీమ్‌.. క్వార్టర్స్‌లో బోపన్న ద్వయం   

న్యూయార్క్‌:  యూఎస్‌ ఓపెన్‌లో అమెరికా స్టార్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ జోరు కొనసాగుతున్నది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో తొలి సెట్‌ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకొని ప్రిక్వార్టర్స్‌కు చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, మూడో సీడ్‌ సెరెనా 2-6, 6-2, 6-2 తేడాతో తన దేశానికే చెందిన స్లోన్‌ స్టీఫెన్స్‌పై విజయం సాధించింది. ఆరంభంలో పూర్తిగా తడబడి తొలి సెట్‌ను చేజార్చుకున్నా.. ఆ తర్వాత సెరెనా తన మార్కు ఆధిపత్యంతో అదరగొట్టింది. మిగిలిన రెండు సెట్లను కైవసం చేసుకొని ముందడుగు వేసింది.మరో మ్యాచ్‌లో రెండో సీడ్‌  సోఫియా కెనిన్‌(అమెరికా) 7-6(7/4), 6-3తేడాతో ఓన్స్‌ జబెర్‌(ట్యునిషియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 

ప్రిక్వార్టర్స్‌లో థీమ్‌: 

ఆస్ట్రియా స్టార్‌, రెండో సీడ్‌ డొమెనిక్‌ థీమ్‌ పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో థీమ్‌  6-2, 6-2, 3-6, 6-3 తేడాతో మారిన్‌ సిలిచ్‌(క్రొయేషియా)పై గెలిచాడు.  

క్వార్టర్స్‌లో బోపన్న జోడీ

భారత సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ద్వయం పురుషుల డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న తన భాగస్వామి డెనిస్‌ షపోవలోవ్‌(కెనడా)తో కలిసి 4-6, 6-4, 6-3తేడాతో జర్మన్‌ ద్వయం కెవిన్‌ క్రావిట్జ్‌, ఆండ్రియాస్‌ మైస్‌పై గెలిచాడు. 


logo