న్యూయార్క్: అంచనాలకు అందకుండా సాగుతున్న ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఫైనల్‌కు చేరారు. 19 ఏండ్ల లైలా ఫెర్నాండెజ్ (కెనడా) మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 7-6 (7/3), 4-6, 6-4తో రెండో సీడ్ సబలెంక (బెలారస్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించగా.. 18 ఏండ్ల ఎమ్మా రెడుకాను (బ్రిటన్) 6-1, 6-4తో సక్కారి (గ్రీస్)ని చిత్తుచేసి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకెక్కింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తలపడనుండటం రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.
ఫైనల్లో జొకో..
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో జొకో 4-6, 6-2, 6-4, 4-6, 6-2తో జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించి చరిత్ర పుటల్లోకెక్కేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. మరో సెమీస్‌లో మెద్వెదెవ్ (రష్యా) 6-4, 7-5, 6-2తో అగర్ (కెనడా)పై నెగ్గాడు.