సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 19, 2020 , 01:33:53

కుర్రపోరు షురూ..

కుర్రపోరు షురూ..
  • -నేడు శ్రీలంకతో తలపడనున్న యువ భారత్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌

జూనియర్‌ లెవల్‌ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న యువ భారత్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌ తొలి పోరుకు సిద్ధమైంది. దేశవాళీల్లో ఇప్పటికే తమదైన ముద్రవేసిన ఆటగాళ్లతో టీమ్‌ఇండియా పటిష్ఠంగా కనిపిస్తుంటే.. సీనియర్‌ జట్టు బాటలోనే లంక యువ జట్టు కూడా తిరోగమన దిశగా పయనిస్తున్నది. సఫారీ గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్న మన కుర్రాళ్లకు.. లంకేయులు ఏమాత్రం అడ్డుకట్ట వేస్తారో చూడాలి.

బ్లూమ్‌ఫాంటైన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అండర్‌-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన యువ భారత్‌.. ఆదివారం శ్రీలంకతో తొలిమ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత కుర్రాళ్లు.. ఈ సారి కూడా ట్రోఫీని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. దక్షిణాఫ్రికా పరిస్థితులకు అలవాటు పడేందుకు దాదాపు రెండు నెలల ముందే సఫారీ గడ్డపై అడుగుపెట్టిన యువ భారత్‌.. అప్పటి నుంచి మెరుపులు మెరిపిస్తూనే ఉంది. మొదట ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను ఒడిసి పట్టిన ప్రియం గార్గ్‌ సేన.. అనంతరం క్వాడ్రాంగ్యులర్‌ సిరీస్‌లోనూ విజేతగా నిలిచింది. మరి బ్యాటింగ్‌ బౌలింగ్‌ల్లో చక్కటి నైపుణ్యం కలిగిన కుర్రాళ్లతో కూడిన జట్టుకు లంకేయులు ఏమాత్రం పోటీనిస్తారో చూడాలి.

తిలక్‌ మెరిపించేనా..

అంతర్జాతీయ స్థాయిలో రాణించకముందే.. ఐపీఎల్‌ వేలంలో కండ్లు చెదిరే ధర దక్కించుకున్న కుర్రాళ్లు.. మెగాటోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కెప్టెన్‌ ప్రియం గార్గ్‌, యశస్వి జైస్వాల్‌, ఠాకూర్‌ తిలక్‌ వర్మ, ధృవ్‌ జురేల్‌, సిద్ధేశ్‌ వీర్‌, దివ్యాన్ష్‌ సక్సేనాతో కూడిన మన బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేద్యంగా కనిపిస్తున్నది. దేశవాళీల్లో రాణించిన ప్రియం, యశస్వీ ఇక్కడా అదే జోరు కొనసాగించాలని భావిస్తుంటే.. తెలంగాణ యువ ఆటగాడు నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణలో రాటుదేలిన మనవాళ్లు ఒత్తిడిని జయించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. బౌలింగ్‌లో యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగి, స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, అంకొలేకర్‌ రాణిస్తే.. ప్రత్యర్థికి కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు లంక జట్టులోనూ సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కుర్రాళ్లు ఉన్నారు. 


logo