సోమవారం 01 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 16:09:40

అంద‌రూ హీరోలే.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌యమిది

అంద‌రూ హీరోలే.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌యమిది

అద్భుతం.. అపూర్వం.. అనిత‌ర సాధ్యం.. అన‌న్య సామాన్యం.. ఏమ‌ని వ‌ర్ణించ‌గ‌లం ఈ విజ‌యాన్ని. అస‌లు ఈ గెలుపు వ‌ర్ణించ‌డానికి మాట‌లు స‌రిపోతాయా? సరిగ్గా ఒక నెల ముందు టీమిండియా ప‌రిస్థితి ఏంటో ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకోండి. అడిలైడ్ టెస్ట్‌లో దారుణ ప‌రాజ‌యం.. 36 ప‌రుగుల‌కే ఆలౌటై.. భార‌త టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అతి త‌క్కువ స్కోరు సాధించార‌న్న అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు. స్టార్ ప్లేయ‌ర్, కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఇంటిదారి ప‌ట్టాడు. దీనికి తోడు వ‌రుస గాయాలు. మ్యాచ్ గడుస్తున్న కొద్దీ ఒక్కో ప్లేయ‌ర్ గాయం బారిన ప‌డి సిరీస్‌కు దూర‌మ‌య్యారు. ష‌మి, ఉమేష్‌, రాహుల్‌, జ‌డేజా, అశ్విన్‌, విహారి, బుమ్రా.. ఇలా తుది జ‌ట్టులో ఉండాల్సిన ప్ర‌తి ఒక్క‌రూ గాయాల‌తో త‌ప్పుకున్నారు. నాలుగో టెస్ట్‌కు ముందు అస‌లు 11 మంది అయినా దొరుకుతారా లేదా అన్న దుస్థితి. దీనికి తోడు 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు పెట్ట‌ని కోట‌గా ఉన్న బ్రిస్బేన్ స్టేడియంలో మ్యాచ్‌. ఇవి చాల‌వ‌న్న‌ట్లు ఆస్ట్రేలియా అభిమానుల నోటి దురుసు. వైట్ వాష్ అవుతారంటూ ఆసీస్ మాజీల‌ వెక్కిరింత‌లు. ఇన్ని అడ్డంకులు, అప‌శ‌కునాల మ‌ధ్య టీమిండియా గెలుస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. ఒక్క టీమ్‌లో ఉన్న ఆ 11 మంది త‌ప్ప‌. అది చాలు క‌దా చ‌రిత్ర సృష్టించ‌డానికైనా.. చ‌రిత్ర తిర‌గ‌రాయ‌డానికైనా. ఇప్ప‌డు ర‌హానే సేన అదే చేసి చూపించింది. 

ఒక‌రా.. ఇద్ద‌రా.. 

ఈ విజ‌యం ఎవరిది? దీనికి స‌మాధానం చెప్ప‌డం అసాధ్య‌మేమో. ఒక‌రా.. ఇద్ద‌రా.. ఒక ర‌కంగా చెప్పాలంటే టీమ్‌లోని అంద‌రూ హీరోలే. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ చెప్పిన‌ట్లు.. ఈ సిరీస్‌లో ప్ర‌తి సెష‌న్ టీమ్‌కు ఒక హీరోను అందించింది. ఎవ‌రి ఆట‌ను త‌క్కువ చేయ‌గ‌లం. తొలిటెస్ట్‌లో అంత దారుణంగా ఓడిన త‌ర్వాత రెండో టెస్ట్‌లో గెలుస్తార‌ని క‌లలో అయినా ఊహించామా?  కానీ కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి న‌డిపి.. టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు అజింక్య ర‌హానే. ఒక ర‌కంగా మెల్‌బోర్న్‌లో అత‌ను చేసిన సెంచ‌రీయే సిరీస్‌ను మ‌లుపు తిప్పింది. కెప్టెన్ ఇన్నింగ్స్ చూసిన త‌ర్వాత టీమ్‌లోని ప్ర‌తి ఒక్క ప్లేయ‌ర్‌.. త‌మ సామ‌ర్థ్యం మేర‌కు ఆడారు. మూడో టెస్ట్‌లో ఓట‌మి ఖాయ‌మ‌నుకున్న వేళ.. పంత్‌, అశ్విన్‌, విహారి పోరాడిన తీరును ఎవ‌రైనా అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోగ‌ల‌రా?  గాయాలు వేధిస్తున్నా.. ఆసీస బౌల‌ర్లు బౌన్స‌ర్ల‌తో బెంబేలెత్తిస్తున్నా.. మాట‌ల‌తో వేధించినా.. చెక్కు చెద‌ర‌ని ఏకాగ్ర‌త‌, ప‌ట్టుద‌ల‌తో సిడ్నీ టెస్ట్‌ను టీమిండియా డ్రాగా ముగించిన తీరు అసాధార‌ణం. 

ఇది అల్టిమేట్‌..

నిజానికి ఒక్కో టెస్ట్ ఆడుతున్న కొద్దీ టీమిండియా క‌ష్టాలు పెరుగుతూ వ‌చ్చాయి. సిడ్నీ టెస్ట్‌లో స్ఫూర్తిదాయ‌క ఆట‌తీరుతో ఆత్మ‌విశ్వాసాన్ని కూడ‌గ‌ట్టుకున్న ర‌హానే సేన‌కు.. నాలుగో టెస్ట్‌కు ముందు మ‌రిన్ని ప్ర‌తికూల‌త‌లు ఎదుర‌య్యాయి. ఆ టెస్ట్ హీరోలు జడేజా, అశ్విన్‌, విహారి, బుమ్రా చివ‌రి టెస్ట్‌కు దూర‌మ‌య్యారు. ఒక ర‌కంగా చెప్పాలంటే నాలుగో టెస్ట్‌లో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం సాధించిన టీమ్‌లోని స‌భ్యుల్లో స‌గం మంది అస‌లు తుది జ‌ట్టులోకి త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో వ‌చ్చిన వాళ్లే. అయితేనేం.. త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. ఓపెన‌ర్‌గా రాణించిన శుభ్‌మ‌న్ గిల్ అయితేనేమీ.. ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, శార్దూల్ ఠాకూర్ అయితేనేమీ.. సీనియ‌ర్లు ఎవ‌రూ లేని స‌మ‌యంలో పేస్ బౌలింగ్ భారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా మోసిన మ‌న హైద‌రాబాదీ పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ అయితేనేమీ.. ఎవ‌రి పాత్ర‌ను త‌క్కువ చేయ‌గ‌లం.. అంతెందుకు చివ‌రి రోజు ఆసీస్ బౌల‌ర్లు త‌న ఒంటినే ల‌క్ష్యంగా చేసుకొని బంతులు సంధిస్తున్నా ఆ గాయాల‌ను త‌ట్టుకొని నిల‌బ‌డిన సీనియ‌ర్ ప్లేయ‌ర్ పుజారా ఇన్నింగ్స్‌ను త‌క్కువ చేయ‌గ‌ల‌మా? అందుకే ఈ సంచ‌ల‌న‌, చారిత్ర‌క విజ‌యంలో అంద‌రూ హీరోలే. 

ఇవి కూడా చదవండి..

50 ఏళ్ల గ‌వాస్క‌ర్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన శుభ్‌మ‌న్ గిల్‌

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

టీమిండియా విజ‌యంపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

రిష‌బ్ పంత్ సూప‌ర్ షో.. క్లాసిక్‌ ఇన్నింగ్స్‌

ఆస్ట్రేలియాను మ‌ట్టి క‌రిపించిన టీమిండియా

నా జీవితంలో మ‌రుపు రాని రోజు ఇది: రిష‌బ్ పంత్‌

ధోనీని మించిన రిష‌బ్ పంత్‌.. కొత్త రికార్డు

VIDEOS

logo