శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 02, 2020 , 15:17:00

12 ఏళ్ల త‌ర్వాత కోహ్లి తొలిసారి ఇలా..!

12 ఏళ్ల త‌ర్వాత కోహ్లి తొలిసారి ఇలా..!

క్యాన్‌బెరా: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలుసు క‌దా. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 12 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మ‌న్‌గా స‌చిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బ‌ద్ధ‌లుకొట్టాడు. అయితే ఇదే మ్యాచ్‌లో అత‌డు రెండు కోరుకోని రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. అందులో ఒక‌టి.. 12 ఏళ్ల త‌ర్వాత వ‌న్డేల్లో సెంచ‌రీ లేకుండానే ఏడాది ముగించ‌డం. 2020లో విరాట్ త‌న చివ‌రి వ‌న్డే మ్యాచ్ ఆడేశాడు. 

కానీ ఈ ఏడాది ఒక్క సెంచ‌రీ కూడా కొట్ట‌లేదు. రెండో వ‌న్డేలో చేరువ‌గా వ‌చ్చినా 89 ప‌రుగుల ద‌గ్గ‌ర ఔట‌య్యాడు. మూడో వ‌న్డేలోనూ 63 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. 2008లో అరంగేట్రం చేసిన విరాట్‌.. ఆ ఏడాది మొత్తంలో కేవ‌లం ఒక హాఫ్ సెంచ‌రీ మాత్ర‌మే చేశాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా 11 ఏళ్ల పాటు క‌నీసం ఒక్క సెంచ‌రీ అయినా చేస్తూ వ‌చ్చాడు. 2017, 2018ల‌లో అయితే ఆరేసి సెంచ‌రీలు చేయ‌డం విశేషం. అలాంటిది 2020లో మాత్రం ఒక్క‌సారి కూడా మూడంకెల స్కోరును అందుకోలేక‌పోయాడు. 

ఇక అత‌డు కోరుకోని మ‌రో రికార్డు.. వ‌రుస‌గా నాలుగు వ‌న్డేల్లో ఒకే బౌల‌ర్‌కు త‌న వికెట్ స‌మ‌ర్పించుకోవ‌డం. ఆస్ట్రేలియా బౌల‌ర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ సిరీస్ మూడు వ‌న్డేల్లో కోహ్లిని హేజిల్‌వుడే ఔట్ చేయ‌డం విశేషం. అంత‌కుముందు బెంగ‌ళూరులో జ‌రిగిన చివ‌రి వన్డేలోనూ విరాట్‌ను ఔట్ చేశాడు. దీంతో కోహ్లిని వ‌రుస‌గా నాలుగుసార్లు ఔట్ చేసిన తొలి బౌల‌ర్‌గా అత‌డు నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ట్రెంట్ బౌల్ట్‌, జునైద్ ఖాన్‌, రిచ‌ర్డ్‌స‌న్ కోహ్లిని వ‌రుస‌గా మూడుసార్లు ఔట్ చేశారు. 


logo